రేవంత్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అక్షయపాత్రలాంటి హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ అస్తవ్యస్తంగా మారింది. ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది లేదు. ఒక్కటంటే ఒక్క ప్రణాళికను కొసదాకా అమలు చేసింది లేదు. పైపెచ్చు కీలక విభాగాల్లోనే అధికారులను కదురుగా ఉంచకుండా వరుస బదిలీలతో మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ కుర్చీలో ఏడాదిన్నరలోనే నలుగురు మారారు. కాంగ్రెస్ వచ్చాక ముగ్గురు కమిషనర్లు పోయి నాలుగో అధికారి వచ్చారంటే సరాసరిన ఒక్కో అధికారి 5 నెలలు కూడా ఉండటం లేదు.
ఇక కేసీఆర్ హయాంలో ఆర్థికంగా, అభివృద్ధి పనుల పరంగా కళకళలాడిన హెచ్ఎండీఏ ఇప్పుడు అత్యంత దీనస్థితిలోకి వెళ్లిపోయింది. రియల్-నిర్మాణ రంగాలు పడిపోవడంతో నెలకు రూ.120 కోట్లకు పైగా వచ్చే ఆదాయం సగానికంటే తక్కువగా.. అంటే రూ.50 కోట్ల లోపునకు పడిపోయింది. ఒకప్పుడు ప్లాట్ల వేలంపాటల్లో రికార్డులు సృష్టించి ఏటా వేల కోట్ల రూపాయల లింకు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను దిగ్విజయంగా పూర్తి చేసిన హెచ్ఎండీఏ ఏడాదిన్నరలో సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన మినహా ఒక్కటంటే ఒక్క పని కూడా భుజాన వేసుకొని పూర్తిచేసిన దాఖలాల్లేవు.
మహానగరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టడంలో క్షేత్రస్థాయిలో వచ్చే చిక్కుముడులను ఆయా విభాగాలు సమన్వయంతో కలిసి పరిష్కరించడం సవాల్‌గా మారింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కార్పొరేషన్, జలమండలి, హైడ్రా, ట్రాఫిక్ విభాగం.. ఇలా వీటి మధ్యనే సమన్వయంలేక అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): చార్ సౌ సాల్కా షహర్! దినదిన ప్రవర్ధమానమై.. నాడు ఉమ్మడి రాష్ట్రమైనా, నేడు తెలంగాణకైనా ఆర్థిక ఇంజిన్‌లా మారిన హైదరాబాద్, దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ధీటుగా ఎదిగి విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. గుండెకాయలాంటి ఈ నగర విస్తరణలో ఒక స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి దశదిశ లేకుండా పోయిందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను విస్తరిస్తామంటూ రేవంత్ సర్కారు మొదలుపెట్టిన ప్రతిపాదనలు ఇప్పుడు ఏ మార్గంలో ఎటు వెళ్తున్నాయో అధికారులకే అంతుబట్టడం లేదు. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పన శరవేగంగా సాగుతున్న తరుణంలో వచ్చిన రేవంత్ ప్రభుత్వం అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లా తయారైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇందుకు బలాన్ని చేకూర్చేలా మహానగరానికి ఆయువుపట్టులాంటి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి కీలక విభాగాల్లో ఏడాదిన్నరగా ఒక్క అధికారి సైతం కుదురుగా ఉన్న దాఖలాల్లేవు. తాజాగా రెండు రోజుల కిందట మరోసారి అధికారుల బదిలీలు, విస్తరణలోని మార్పులు ఇప్పటికే కుదేలైన రియల్-నిర్మాణ రంగాలపై మరో పిడుగులా మారనున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎట్లుండె హెచ్ఎండీఏ..ఎట్లయింది!
కేసీఆర్ హయాంలో కళకళలాడిన హెచ్ఎండీఏ ఇప్పుడు అత్యంత దీనస్థితిలోకి వెళ్లిపోయింది. రియల్-నిర్మాణ రంగాలు పడిపోవడంతో నెలకు రూ.120 కోట్లకు పైగా వచ్చే ఆదాయం సగానికంటే తక్కువగా రూ.50 కోట్ల లోపునకు పడిపోయింది. ఒకప్పుడు ప్లాట్ల వేలంపాటల్లో రికార్డులు సృష్టించి ఏటా వేల కోట్ల రూపాయల లింకు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను దిగ్విజయంగా పూర్తి చేసిన హెచ్ఎండీఏ ఏడాదిన్నరలో సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన మినహా ఒక్కటంటే ఒక్క పని కూడా భుజాన వేసుకొని పూర్తి చేసిన దాఖలాల్లేవు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి హెచ్ఎండీఏ కమిషనర్‌గా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్ వ్యవహరించారు. రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా జాయింట్ కమిషనర్ (జేసీ) పోస్టును సృష్టించి ఆ బాధ్యతలను ఆమ్రపాలికి అప్పగించింది. కొన్నాళ్లకే ఆమెకు మూసీ, గ్రోత్ కారిడార్ బాధ్యతలు అప్పగించి జేసీగా శ్రీవాత్సవను తీసుకొచ్చింది. కొంతకాలానికి హెచ్ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌కు బాధ్యతలు అప్పగించింది.
మౌలిక వసతుల కల్పనలో పెద్ద చిక్కుముడి
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కేంద్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి కొనసా…గిస్తున్నది. పనులు జరిగే చోట రహదారి గుంతలతో అస్తవ్యస్తంగా తయారై జనం ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. ఆ గుంతలను పూడ్చాలంటే జీహెచ్ఎంసీ అధికారులేమో అవి తమ పరిధిలోకి రావని, ఆర్అండ్బీ అయినందున వాళ్లే చూసుకోవాలని చెప్తున్నారు. ఆర్అండ్బీ ఆ చిన్న పనులు తామెలా చేస్తామని చేతులెత్తేశారు. కాగితాలపై గీసే అధికారిక హద్దులతో క్షేత్రస్థాయిలో వచ్చే నిర్వహణలో ఎన్ని చిక్కుముడులు ఉంటాయనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే! రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు హద్దును నిర్ణయించుకొని మాస్టర్‌ప్లాన్- 2051ని రూపొందించేందుకు నిర్ణయించింది.
కానీ ట్రిపుల్ ఆర్ పరిధి వరకు అధికారికంగా అనేక విభాగాల సరిహద్దులున్నాయి. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టడంలో క్షేత్రస్థాయిలో రోజువారీగా వచ్చే చిక్కుముడులను ఆయా విభాగాలు సమన్వయంతో కలిసి పరిష్కరించడం సవాల్‌గా మారుతుందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కార్పొరేషన్, జలమండలి, హైడ్రా, ట్రాఫిక్ విభాగం.. ఇలా వీటి మధ్యనే సమన్వయంలేక అనేక సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో ప్రణాళికాబద్ధంగా లేని ఈ అధికారిక గీతలతో మరెన్ని చిక్కులొస్తాయోనన్న అంశంపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరమున్నదని సదరు అధికారి సూచించారు.
గాడితప్పిన జీహెచ్ఎంసీ
రేవంత్ ఏడాదిన్నర పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించలేదు. ఒక్క ప్రణాళికను కూడా పూర్తిస్థాయిలో అమలు చేసింది లేదు. కీలక విభాగాల్లో అధికారులను కుదురుగా ఉంచకుండా వరుస బదిలీలు చేస్తుండటం మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నది. (జీహెచ్ఎంసీ కమిషనర్ కుర్చీలో ఏడాదిన్నరలోనే నలుగురు మారారు. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న రోనాల్డ్ రాస్‌ను దాదాపు మూడు నెలలకే బదిలీ చేసింది. ఆయన స్థానంలో హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు ఇచ్చిన ప్రభుత్వం కొన్నిరోజులకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. క్యాట్ ఆదేశాలతో ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడంతో మరో నాలుగు నెలల్లో ఆమ్రపాలి స్థానంలో ఇలంబర్తిని తెచ్చిపెట్టింది.
కమిషనర్‌గా ఇలంబర్తి కుదురుకునే సమయంలోనే ఏడు నెలల్లోపే ఆయనను బదిలీ చేసి ఆర్వీ కర్ణన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఏడాదిన్నరలో ముగ్గురు కమిషనర్లు పోయి నాలుగో అధికారి వచ్చారంటే సరాసరి ఒక్కో అధికారి ఐదు నెలలు కూడా సరిగా ఉండలేదు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాలు నగరాభివృద్ధిపై స్పష్టమైన ప్రభావాన్ని చూపాయనేందుకు ఏడాదిన్నరగా కుంటుపడిన అభివృద్ధిని చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన మౌలిక వసతులకు కొన్నింటికి రిబ్బన్ కట్ చేయడం మినహా ఈ ప్రభుత్వం ఒక్క పనీ మొదలుపెట్టలేదు.
విస్తరణ పరిధుల్లో సర్కారు బంతాట!
కీలక విభాగాల్లో అధికారుల బదిలీల తీరు ఇలా ఉంటే.. రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర విస్తరణలో తెరపైకి తెచ్చిన, అమలు చేస్తున్న ప్రతిపాదనలు మరో గందరగోళానికి దారి తీస్తున్నాయి.