రూ. 50 వేలు మాత్రమే నగదు అనుమతి
సిటీబ్యూరో, అక్టోబరు 7 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఫిర్యాదు కమిటీని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీని నగదు సీజ్ చేయడం, రిలీజ్ చేయడం, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీని కమిటీ చూస్తున్నది.
ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలులో ఉన్నందున ఎన్నికల కాలంలో జిల్లా పరిధిలో ప్రయాణం చేసే పౌరులు పరిమిత మొత్తంలో రూ. 50 వేల వరకు మాత్రమే నగదు, విలువైన వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వైలైన్ టీమ్స్ (ఎస్ఎస్టీ) నిరంతరం తనిఖీలు చేపడుతాయని, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుంటాయని తెలిపారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగదు జప్తునకు సంబంధించి జిల్లా ఫిర్యాదుల కమిటీకి తగిన ఆధారాలు పౌరులు చూపితే సభ్యులు ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలించి జప్తు చేసిన నగదును తిరిగి అందజేయనున్నారు.