Ronald Ross | జీహెచ్ఎంసీ గతేడాది గణాంకాలను అధిగమించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో అద్భుతంగా ఆస్తిపన్ను వసూళ్లను సాధించినట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది రూ. 257కోట్లకు పైగా అదనంగా వసూలైనట్లు వెల్లడించారు. 2023-24 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రూ.1810 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.1917 కోట్ల పన్ను వసూలైందన్నారు. గత సంవత్సరం 2022-23లో ఆస్తిపన్ను సేకరణ రూ.1660 కోట్లతో పోలిస్తే 15.5 శాతం పెరిగిందన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలపై వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం అమలు ద్వారా ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ మాఫీని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వచ్చాయని కమిషనర్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడంతో ఈ ఏడాది దాదాపు రూ.300కోట్ల పన్ను వసూళ్లు జరిగిందన్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు ఆదివారం రూ.123 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు నమోదు చేసినట్లు తెలిపారు. బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు పలువురు బీఎల్వోలు, బీఎల్వో సూపర్వైజర్ల వంటి కీలకమైన ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని ఆధిగమించామని వివరించారు.