సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ ) : బల్దియాలో బదిలీలకు రంగం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియడంతో వివిధ విభాగాలలో కలిపి పెద్ద మొత్తంలో అధికారుల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ శాఖల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. ఒకే చోట మూడేళ్లకు పైబడిన వారందరినీ బదిలీ చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించి, శాఖల వారీగా రిపోర్టులు సిద్ధం చేశారు. ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్) నుంచి జూనియర్, సీనియర్ అసిస్టెంట్స్, ఏఎంసీలు, ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారుల వరకు బదిలీలు జరుగనున్నాయి. వీటితో పాటు పదవీ విమరణ పొంది ఎక్స్‌టెన్షన్‌పై బల్దియాలో కొనసాగుతున్న ముగ్గురి విషయంలోనూ కమిషనర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పర్మినెంట్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిపి 26 నుంచి 28వేల మంది ఉంటారు. 18,500 శానిటేషన్ వర్కర్లు, 950 సూపర్ వైజర్లు, 500 నుంచి 800 మంది ఆపరేటర్లు, 500 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, 400 మంది సూపరింటెండెంట్లు, సుమారు 100 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 20 మంది జాయింట్ కమిషనర్లు, 20 మంది మెడికల్ ఆఫీసర్లు, 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. అయితే ఎక్కువగా బదిలీల్లో మూడేళ్లకు పైబడి ఒకే చోట కొనసాగుతుండడం, అవినీతి ఆరోపణలు, వివాదాస్పద అధికారులకు స్థాన చలనం తప్పదనే చర్చ జోరందుకున్నది. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిప్యూటీ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి ఇతర మున్సిపాలిటీలకు, అక్కడి నుంచి జీహెచ్ఎంసీకి మార్పులు, చేర్పులు జరుగుతాయని అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
జీహెచ్ఎంసీలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న ఏఎంఓహెచ్‌లను తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేస్తారా? లేదా? అని చర్చ జరుగుతున్నది. కూకట్పల్లి జోన్లో ఓ ఏఎంఓహెచ్ 10 ఏండ్ల పాటు కొనసాగుతుండడం ఒక కారణమైతే .. శేరిలింగంపల్లిలో ఓ ఏఎంఓహెచ్ను కమిషనర్ బదిలీ చేసినా కొద్ది రోజుల్లోనే తిరిగి ఆదే స్థానానికి రావడం.. వీరిపై అవినీతి ఆరోపణలు ఉన్నా.. యథేచ్ఛగా కొనసాగుతుండడం పట్ల చర్చ జరుగుతున్నది. అడ్మిన్ సెక్షన్లో ముఖ్య అధికారి 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఈ అధికారికి ప్రస్తుతం బదిలీ జాబితాలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సదరు అధికారి మాత్రం డోంట్ కేర్ అంటూ బదిలీల జాబితాలో ఉండే వారితో పైరవీలకు తెరలేపాడు.
ప్రధాన కార్యాలయంలో తన చాంబర్ వద్ద ప్రస్తుతం పైరవీకారులతో ఆ ప్రాంగణం కళకళలాడుతుంది. బదిలీ కావాల్సిన అధికారే ఈ తరహా వ్యవహారం నడిపిస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ అధికారి వ్యవహార శైలితో క్లాస్-4 ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. స్పోర్ట్స్ విభాగంలో ఓ అధికారి స్వయంగా రూ.2కోట్ల మేర పనుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా తనకు సంబంధించిన ఏజెన్సీకే స్పోర్ట్స్ విభాగం పనులు తీసుకున్నారని, ఈ అధికారిపై ఎస్టేట్ విభాగానికి లీజు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని కమిషనర్‌కు ఫిర్యాదులు చేశారు. కానీ ఈ అధికారి బదిలీ జరగకుండా పైరవీ చేస్తున్నట్లు టాక్ నడుస్తున్నది.