సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ): గతేడాది సంవత్సరం జూలైలో ఆస్తులపై జియోగాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) సర్వేను మొదలుపెట్టారు. దీంతో ఆస్తి పన్ను తకువగా చెల్లిస్తున్న ఆస్తులతో పాటు పెరిగిన అంతస్తులు, వినియోగం వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, శాటిలైట్ ఫొటోలతో సహాయ యజమానులకు నోటీసులు జారీ చేస్తూ ట్యాక్స్ కలెక్షన్‌ను పెంచుకుంటున్నట్లు కమిషనర్ ఆర్ వీ కర్ణన్ పేర్కొన్నారు. గత సంవత్సరం (2024-25) ఆర్థిక సంవత్సరంలో ఇదే రకంగా 71 వేల 747 ఆస్తుల స్ట్రక్చర్, చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలతో పాటు వినియోగిస్తున్న కరెంటు మీటర్ టైప్ వంటి వివరాలను సేకరించి ఆస్తి పన్నును సవరించినట్లు తెలిపారు.
అప్పటి వరకు ఈ ఆస్తులు రూ. 47.74 కోట్ల మాత్రమే చెల్లిస్తుండగా, సవరించిన తర్వాత ఈ ట్యాక్స్ రూ. 130.34 కోట్లకు పెరిగిందన్నారు. వర్తమాన ఆర్తిక సంవత్సరం (2025-26)లో కూడా మరో 17 వేల 905 ఆస్తుల ట్యాక్స్ వివరాలు, వర్తమాన స్ట్రక్చర్ వివరాలను సర్వేలో సేకరించిన అధికారులు ఈ ఆస్తుల ట్యాక్స్‌ను కూడా సవరించినట్లు చెప్పారు. సర్వే ముందు ఈ ఆస్తులు కేవలం రూ. 31.62 కోట్ల ట్యాక్స్ చెల్లిస్తుండగా, సవరించిన తర్వాత రూ. 76.82 కోట్లకు ట్యాక్స్ పెరిగింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్లు డిసెంబర్ 3 వరకు రూ. 1,512 కోట్లు దాటినట్లు, గతేడాదితో పోల్చితే 8 శాతం, అంటే రూ. 120 కోట్లు పెరిగాయని కమిషనర్ వెల్లడించారు.
డ్రోన్లతో జీఐఎస్ సర్వే చేసి 14 లక్షల ఇళ్లను మ్యాపింగ్ చేశామని, లక్ష మందికి నోటీసులు ఇచ్చినట్లు కమిషనర్ వివరించారు. కరెంట్ బిల్లు డేటాను కూడా లింక్ చేయడంతో పన్ను కట్టని వాళ్ల కథ తేలిపోతుందన్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగియనుండడంతో అప్పటి వరకు 300 వార్డులతో ఒక కార్పొరేషన్‌గానే కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువు ముగియగానే నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా మార్చే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాగా, గత నవంబర్ 25 వరకు 650 కి.మీ.ల విస్తీర్ణం, ఆరు జోన్లు, 30 సరిళ్లతో ఉన్న జీహెచ్ఎంసీ ఆ తర్వాత దేశంలోనే అతి పెద్ద నగరంగా అవతరించింది.2 వేల 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి విస్తరించింది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. దీంతో పెరిగిన విస్తీర్ణాన్ని అధికారులు పునర్విభజించారు. దీంతో జీహెచ్ఎంసీలోని వార్డులు, సరిళ్లు, జోన్లు రెండింతలయ్యారు. సరిళ్లు 30 నుంచి 60 కాగా, జోన్లు ఆరు నుంచి 12గా ఏర్పడ్డాయి. పునర్విభజన ఆనంతరం అధికారులు విలీన ప్రాంతాన్ని పునర్ వ్యవస్థీకరించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. తొలుత జోనల్ కమిషనర్లు, ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ల నియామకం చేపట్టిన ఉన్నతాధికారులు, ఆ తర్వాత ప్రతి మూడు జోన్లకు ఒకరు చొప్పున ఆరు జోన్లకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను అదనపు కమిషనర్లుగా నియమించగా, వారు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ 2025లో సాధించిన పలు ముఖ్యమైన ఫలితాలను కమిషనర్ ఆర్ వీ కర్ణన్ బుధవారం మీడియాతో పంచుకున్నారు.
మరో 1000 టన్నుల వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్
దేశవ్యాప్తంగా జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ లో జీహెచ్ఎంసీకి 6వ ర్యాంక్ సాధించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. జవహర్ నగర్లో చెత్తతో కరెంటు తీసే ప్లాంట్, మరో 1000 టన్నుల వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ కూడా రెడీ అవుతుందని,. ఇప్పటికే చెత్తతో విద్యుత్ తయారు చేసేందుకు జవహర్‌నగర్‌లో 24 మెగా వాట్ల ప్లాంట్ నడుస్తుండగా, మరో 24 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో ప్లాంట్‌ను రెఢీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఏకంగా చెత్తతో 48 మెగావాట్ల విద్యుత్ ను తయారు చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని కమిషనర్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరాన్ని మరింత క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దటంలో పౌరులను కూడా భాగస్వాములను చేయాలని, వారికి చెత్తపై అవగాహన పెంచేందుకు రోడ్ల మీద చెత్త వేస్తే మాత్రం భారీగా ఫైన్లు విధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఈ రకంగా ఫైన్లు విధించి జీహెచ్ఎంసీ ఏకంగా రూ. 2.34 కోట్లు వసూలు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో మెగా శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని, ఈ డ్రైవ్ జనవరి చివరి కల్లా కొనసాగించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. మీ ఏరియాలో పాత వానాలు, వినియోగించని ఎలాంటి మెటీరియల్ ఉన్నా, టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 లేదా, ఉంటే పేరుకుపోయి ఉన్నా, వాట్సప్ నెంబర్ 81259 66586 సమాచారమందిస్తే వెంటనే తరలిస్తారని కమిషనర్ వెల్లడించారు.
కూకట్ పల్లిలో రూ. 5 కోట్ల టెస్టింగ్ ల్యాబ్
గ్రేటర్లో ఆహార విక్రయ కేంద్రాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. హోటల్స్, మెస్ లు, బేకరీలు, బిర్యానీ హోటల్స్ తో పాటు టిఫిన్ సెంటర్ వంటి తదితర ఆహార విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికపుడు తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,656 తనిఖీలు నిర్వహించి, క్వాలిటీ లేని హోటల్స్ ను గుర్తించి నిర్వాహకులకు రూ.14.84 లక్షల పెనాల్టీలు విధించి, వసూలు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. గ్రేటర్లో ఆహార భద్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కూకట్ పల్లిలో ఏకంగా రూ. 5 కోట్ల వ్యయంతో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక హెల్త్ విషయాని కొస్తే, గతేడాదితో పోలిస్తే డెంగ్యూ కేసులు 30% తగ్గాయని, ఇందుకు జీఐఎస్‌తో లింకు చేసిన ఫాగింగ్ మిషన్ల పనితీరే కారణమని ఆయన వెల్లడించారు. ఇంటింటికీ తిరిగి దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని, జంతు ప్రేమికుల కోసం కూకట్ పల్లిలో స్పెషల్ యానిమల్ స్మశానవాటికను కూడా సిద్ధం చేశామని కమిషనర్ కర్ణన్ వెల్లడించారు.
వచ్చే ఏడాదిలోనే ఎస్ఆర్డీపీ పనులు పూర్తి
రూ. 2,700 కోట్లతో వేల సంఖ్యలో ఇంజనీరింగ్ పనులు కొనసాగుతున్నాయని, పీజేఆర్ ఫె్లైఓవర్, ఆరాంఘర్ ఫె్లైఓవర్, ఫలక్ నుమా ఆర్ఓబీలు అన్నీ పబ్లిక్ కోసం అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. హెచ్ సిటీ కింద చేపట్టాల్సిన పనుల్లో మెజార్టీ పనులు గ్రౌండింగ్ అయ్యాయని, మొత్తం రూ. 7038 కోట్లతో అయిదు ప్యాకేజీలుగా మొత్తం 23 పనులు మొదలుకానున్నట్లు చెప్పారు.. వీటిలో కేబీఆర్ పారు చుట్టూ ఏడు అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫె్లై ఓవర్లతో పాటు కూకట్ పల్లి వై జంక్షన్ లో అటు మియాపూర్ వరకు, ఇటు అమీర్ పేట వరకు రెండు ఫె్లై ఓవర్ల పనులు కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి సర్వేలు, భూసార పరీక్షలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని కమిషనర్ వివరించారు. వీటికి తోడు వర్షాకాలంలో ముంపు సమస్య లేకుండా రూ.667 కోట్లతో నాలాల పనులు (ఎస్ ఎన్ డీపీ) స్పీడ్ గా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదిలోనే పురోగతి ఉన్న ఎస్ఆర్డీపీ పనులన్నీ పూర్తి కానున్నట్లు చెప్పారు.