సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో పేరులేనివారు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం కేబీఆర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓటరు ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు జాబితాలో తప్పులు సరిదిద్దుకోవడంతోపాటు జాబితాలో పేరులేని వారికోసం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పార్కులో వాకింగ్ చేస్తున్న వాకర్స్‌తో సంభాషించారు. మీకు ఓటు ఉన్నదా.. టే ఏమైనా తప్పులు ఉన్నాయా.. ఉంటే సవరించుకునే అవకాశం ఉందని తెలిపారు. అక్కడికక్కడే వాకింగ్ చేస్తున్న మహిళా వాకర్ చేత voter helpline యాప్‌ను డౌన్లోడ్ చేయించి పరిశీలన చేయించారు. అక్టోబర్ 31వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవచ్చని సూచించారు. నగరంలో మేజర్ పార్కులు, థీమ్‌పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఓటరు నమోదు కోసం అవగాహనతో పాటు ఫారం-8, ఫారం-6 దరఖాస్తులను ఎలా పూర్తి చేయాలో అక్కడున్న సిబ్బంది వివరిస్తారని కమిషనర్ పేర్కొన్నారు.