సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ ) రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలు తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, నాలా పూడికతీత, నాలా భ్రదతా చెరువుల పునరుద్దరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి కమిషనర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్షాకాలంలో ఎదురయ్యే పలు సమస్యలపై ఇరు శాఖల అధికారులు చర్చించారు. గ్రేటర్లో ఇప్పటికే గుర్తించిన 141 నీటి నిల్వ ప్రాంతాల వద్ద ప్రతేక్య చర్యలు చేపట్టాలని కమిషనర్ ఇలంబర్తి సూచించారు. భవిష్యత్తులో నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. నాలాల్లో లోతట్టు ప్రాంతాల్లో పూడికతీత పనులు వర్షాకాలం లోపు పూర్తి చేయాలని తెలిపారు. అందుకోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదాలు జరగకుండా నాలా ఆడిట్
నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్దరణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ తెలిపారు. వర్షాల సందర్భంగా చెరువుల ద్వారా ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని వర్షాకాలంలో నాలాలో ప్రమాదాలు జరగకుండా నాలా ఆడిట్ చర్యలు తీసుకోవాలని, అందుకోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు సర్కిల్‌కు ఓ ప్రత్యేక అధికారిని బాధ్యులను చేయాలని కమిషనర్ సూచించారు.
ప్రమాద నివారణకు చర్యలు తీసుకోండి
వేసవిలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. గ్రేటర్లో వాణిజ్య, నివాస భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన సురక్షిత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని కమిషనర్ తెలిపారు. భవన యజమానులు, నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు, హ్రైడా అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శివ కుమార్ నాయుడు, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, హేమంత్ కేశవ్ పాటిల్, వెంకన్న, రవికిరణ్, సీఈలు భాస్కర్ రెడ్డి, రత్నాకర్, కోటేశ్వరరావు , సీసీపీ కె శ్రీనివాస్, విజిలెన్స్ అదనపు ఎస్పీశ్రీనివాస్ హైడ్రా అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.