సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మహిళా సాధికారిత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో ఎస్టేట్, అర్బన్ కమ్యూనిటీ విభాగం అడిషనల్ కమిషనర్లు, ప్రాజెక్టు అధికారులతో పాటు జోనల్ పీఓలు, అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులతో ఆ శాఖల ప్రగతిపై కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. మహిళా సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళలను కోటిశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ఉన్నందున, నగరంలో అర్హులైన మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్పించి వారికి బ్యాంక్ లింకేజీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అర్హులైన మహిళలందరిని స్వయం సహాయక సంఘాల గ్రూప్లో సభ్యులుగా చేర్చి ఆర్థిక సాధికారతకు దోహదపడే విధంగా కృషి చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు.
బ్యాంక్ లింకేజీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,240 స్వయం సహాయక సంఘాలకు 704.67 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.543.43లను, 5016 సంఘాలకు బ్యాంకు లింకేజీ పంపిణీ చేసిన నేపథ్యంలో వచ్చే నెల వరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా మహిళలకు రూ.412 కోట్ల విలువ గల 487 యూనిట్లు అందించాలనే లక్ష్యం కాగా, రూ.1.59 కోట్ల 184 యూనిట్లకు పంపిణీ చేసినట్లు వివరించారు.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో మొత్తం 7వేల మహిళా ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ నెలకొల్పేందుకు నగర వ్యాప్తంగా రూ.410 కోట్లతో 6000 వ్యక్తిగత ఎంటర్ ప్రైజెస్, మరో 1000 గ్రూప్ ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి సీం ద్వారా గ్రూప్, వ్యక్తిగత ఎంటర్ ప్రెన్యూయర్ ఏర్పాటు రుణాలు అందించేందుకు గుర్తింపు చేసి ప్రాధాన్యతా క్రమంలో జనవరి 20 వరకు రుణాలు అందించేందుకు తీసుకోవాలన్నారు. ఇదే క్రమంలో పీఓలు, డీపీఓలు సరిల్ వారీగా సీఓ, ఆర్పీ వారీగా టార్గెట్ నిర్ణయించి, ఈ లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు.