సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రహదారులపై నీరు నిలిచిందని, ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు, జోనల్ కమిషనర్లతో ఆమ్రపాలి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారులపై మరమ్మతులు చేస్తున్న స్థలం వద్ద ప్రమాదాలు సంభవించకుండా..భద్రతా చర్యల్లో భాగంగా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులతో పాటు రాత్రి సమయంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
బహుళ అంతస్తుల నిర్మాణాలు, నాలాలు, నీటి వనరుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. మెహిదీపట్నం, హఫీజ్‌నగర్, అత్తాపూర్, గుడి మల్కాపూర్, విజయ్‌నగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వాటర్ లాగింగ్ పాయింట్లను కమిషనర్ పరిశీలించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. భారీ వర్షంతో హుస్సేన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 1850 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి తెలిపారు.
మ్యాన్ హోల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని నగర పౌరులకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే..జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ నం. 155313కి ఫోన్ చేయాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.