సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గణేశ్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో రోడ్డుపై పడిన చెత్త, ఇతర వ్యర్థాలు వెను వెంటనే తొలగించేందుకు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే అదనంగా శానిటేషన్ కార్మికులను ఏర్పాటు చేసి.. రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డార్క్ స్పాట్స్ లేకుండా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనాన్ని పురస్కరించుకొని శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లపై పాట్‌హోల్స్ పూడ్చాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వరద ముంపు నివారణలో భాగంగా హెచ్-సిటీ ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు కమిషనర్ ఆమ్రపాలి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇంజినీర్లతో కలిసి పర్యటించారు. అల్కాపురి జంక్షన్, ఫ్లై ఓవర్ ప్రతిపాదన, టీకేఆర్ జంక్షన్ నుంచి గాయత్రీ నగర్, మంద మల్లయ్య జంక్షన్ వరకు చేపట్టనున్న ఫ్లై ఓవర్ ప్రతిపాదనలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఆవశ్యకతను ప్రాజెక్టు సీఈ దేవానంద్ కమిషనర్‌కు వివరించారు.