సిటీబ్యూరో, జూలై 27(నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో బోనాలకు సర్వం సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
తాగునీరు, పాట్ హోల్స్, పారిశుధ్యం, అవసరమైన చోట టాయిలెట్స్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, స్ట్రీట్ వెండర్లు వ్యర్థాలను బయటపడేయకుండా చెత్త కుండీల్లో వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆలయాల చుట్టూ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడూ చెత్తను తీసేలా శానిటేషన్ కార్మికులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ హాల్స్ వివరాలను సర్కిళ్ల వారీగా పంపించాలని, కావాల్సిన మరమ్మతులు, ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.
బోనాల పండుగను పురస్కరించుకుని సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లను మూసివేస్తున్నట్లు పోలీసు కమిషనర్లు అవినాశ్ మహంతి, సుధీర్‌బాబు వెల్లడించారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత సమయంలో విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.