Muski Cheruvu | మణికొండ, జులై 2 : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ముష్కి చెరువు పరిరక్షణ కోసం అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తామని మున్సిపల్, నీటిపారుదల శాఖ, జలమండలి శాఖ అధికారులు పేర్కొన్నారు. హాల్‌మార్క్ విసినియా, మై హోమ్ అవతార్ రెసిడెన్షియల్ కమ్యూనిటీల పక్కనే ఉన్న ముష్కి చెరువు అభివృద్ధి పేరుతో, ధ్రువాంచ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మధులిక ఆధ్వర్యంలో అనేక అక్రమ చర్యలు కొనసాగుతున్నాయని, ఈ చర్యలు చెరువు పర్యావరణాన్ని, సమీప ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా హాని చేస్తున్నాయి అంటూ… ఈ సమస్యలను మణికొండ మున్సిపల్ కమిషనర్ , స్థానిక ఎమ్మెల్యే నివేదించడంతో, సంబంధిత అధికారులు చెరువును స్వయంగా పరిశీలించారు.
మణికొండ మున్సిపాలిటీ డీఈ శివ సాయి, ఇరిగేషన్ శాఖ డిఈ రమాదేవి, జలమండలి శాఖ జీఎం రాజులు కలిసి బుధవారం ముష్కి చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ధ్రువాన్సు స్వచ్ఛంద సంస్థ చేపట్టిన పనులను కూడా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెట్లను ఇష్టానుసారంగా నరికివేసి పర్యావరణాన్ని పూర్తిగా మంటగల్పుతున్నారని తక్షణమే ఇలాంటి సంస్థలను నిషేధించాలని స్థానిక మై హోమ్ అవతార్, హాల్ మార్క్ విసినియ నివాసితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. మురికి నీటి కలయిక తక్షణం ఆపాలని, గత రెండేళ్లుగా చెరువులోకి అధిక కాలుష్య స్థాయిలో మురికి నీరు ప్రవహిస్తోందని తద్వారా తమ ఆరోగ్యాలు పూర్తిగా అనారోగ్యం పాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నామని స్థానిక ప్రజలు అధికారులకు తెలిపారు.
ఈ నీరు గండిపేట మంచినీటి పైపులైన్ మీదుగా ప్రవహించే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. ఇది బఫర్ జోన్ కావడం వల్ల ఇక్కడ నిర్మాణాలు, నీటి ప్రవాహం తప్పు మార్గంలో జరగడం పూర్తిగా చట్ట విరుద్ధంగా ఉందని అధికారులకు తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలో సైడ్ మట్టి కట్టలు వేసి సహజ నీటి ప్రవాహాన్ని నిరోధించడం, 54 ఎకరాల చెరువును కేవలం 10 ఎకరాలకు కుదించగల ప్రమాదం, కమ్యూనిటీ CC డ్రెయిన్‌ను బద్దలు కొట్టి మురికి నీటిని దానిలోకి పంపించడం, చెరువు ఎంట్రన్స్ వద్ద రహదారిని ఎత్తు పెంచి వర్షపు నీటిని కమ్యూనిటీ వైపు మళ్లించడం, పురాతన తుమ్మ చెట్లు నరికి వేయడం, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా పనులు చేయడం పై ధ్రువాన్సు స్వచ్ఛంద సంస్థ నిర్లక్ష్య వైఖరిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ FTL ప్రాంతంలో మట్టి కట్టలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇటువంటి నిర్మాణాలు జరగలేవని తెలిపారు. మట్టి తొలగించి సహజ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మురికి నీటిని సీసీ డ్రెయిన్ ద్వారా కాకుండా, చెరువుకు చెడు చేయని మార్గంగా మళ్లిస్తామన్నారు. ఎంట్రన్స్ వద్ద మట్టి తొలగించి రహదారికి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. శాశ్వత పరిష్కారం కొద్దీ రోజుల్లోనే చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. మున్సిపల్ బృందంతో కలిసి శనివారం చెరువులోకి వచ్చే మురికి నీటి మూలాన్ని గుర్తించి, శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. గండిపేట వాటర్ లైన్ పైన కొత్త పైపు వేసే యోచన పరిశీలిస్తున్నట్లు జలమండలి శాఖ జిఎం రాజు చెప్పారు. అయితే ఈ మార్గం ప్రమాదకరమవుతుందన్నందున, మురికి నీరును పూర్తిగా ఆపడం ఉత్తమ మార్గమని మేము చెప్పడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇరిగేషన్, హెచ్ఎండబ్ల్యూఎస్, హెచ్ఎండిఏ అధికారులతో సమన్వయం చేసుకొని, చెరువులోకి చేరుతున్న మురికి నీటిని తక్షణమే ఆపేందుకు చర్యలు తీసుకుంటామని మణికొండ మున్సిపల్ అధికారులు హామీ వచ్చారని స్థానికులు తెలిపారు.