సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): నిరుపేదలు సైతం గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా అధునిక హంగులతో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్పై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. 16 నెలలుగా పురోగతిలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడంలో విఫలమైంది. కొన్ని చోట్ల పనులను కనీసం పట్టాలెక్కించలేదు. ఒకేసారి రెండు వేల మందితో వేడుక నిర్వహించేలా సకల సౌకర్యాలతో గత కేసీఆర్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రూ. 90 కోట్లతో 31 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లును నిర్మించాలని భావించి 2023 డిసెంబర్ నాటికి రూ. 30.10కోట్లతో 12 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
నిర్మాణ దశలో 14 చోట్ల పనులు ఉండగా..16 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నర కాలంగా ఈ 14 చోట్ల పనుల్లో ఏ ఒక్కచోటా అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో ఇంజినీర్లు సైతం పురోగతిలో ఉన్న పనులను ముందుకు తీసుకువెళ్లలేక చాలా చోట్ల పనులను చేతులెత్తేశారు. కాంట్రాక్టర్లకు నిధుల లేమి సమస్య ఒకవైపు..మరోవైపు ఇంజినీర్ల అలసత్వం మరోవైపు వెరసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని బహుళ వినియోగ ఫంక్షన్ హాళ్లను సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చి వందలాది మందికి ప్రయోజనం చేకూర్చాలని నగరవాసులు కోరుతున్నారు.