జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీల సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారు. 300 వార్డుల విభజన పూర్తిగా అసంబద్ధం..అశాస్త్రీయంగా జరిగిందంటూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా గగ్గోలు పెట్టారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీలు, ప్రజలను ఎందుకు భాగస్వామ్యం చేయలేదని ప్రశ్నించారు. హడావుడిగా వార్డుల విభజన చేసిన విధానంపై స్పష్టత లోపించిందని, అనేక అనుమానాలు ఉన్నాయంటూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌ను జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా చేశామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా తీవ్రమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికల్లో అసలు మౌలిక వసతులు సరిగా లేవన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్షాలంటూ తేడా లేకుండా కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సైతం డీలిమిటేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ): మేయర్ అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో తొలుత కమిషనర్ ఆర్ వీ కర్ణన్ పట్టణ స్థానిక సంస్థల విలీనంతో 650 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న విస్తీర్ణం సుమారు 2050 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 వార్డులను ఫిక్స్ చేసేందుకు వార్డుల పునర్విభజనకు సంబంధించి సరారు ఇచ్చిన ఆదేశాల మేరకు శాస్త్రీయంగా పునర్విభజన చేశామని వెల్లడించారు. ఈ నెల 10 నుంచి ఏడు రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని చెప్పారు.
ఒకో వార్డుకు నలుదికులా సరిహద్దులను ఫిక్స్ చేస్తూ 45 వేల జనాభాను ప్రామాణికంగా తీసుకొని, 10 శాతం తకువ, ఎకువతో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి డ్రాఫ్ట్‌పై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. పునర్విభజన ప్రక్రియలో పాటించిన పలు నియమ, నిబంధనలతో పాటు జాగ్రత్తలను కమిషనర్ సభకు వివరించారు. తొలుత ఎక్స్ అఫీషియో సభ్యులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. జీహెచ్ఎంసీలో శివారు 27 పురపాలికల విలీనం, జీహెచ్ఎంసీ వార్డు పునర్విభజనను ప్రభుత్వం ఆగమేఘాల మీద చేపట్టిందని, ఈ విషయంపై కనీసం మేయర్‌కైనా సమాచారం ఉందా? అని ప్రశ్నించగా, మేయర్ తనకు సమాచారం లేదన్నట్టుగానే తల ఊపడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులకు సరిపోయే సేవలందించే సిబ్బంది లేకపోగా, కొత్తగా 300 వార్డులుగా పునర్విభజన చేయడం సరికాదని తలసాని ఈ సందర్భంగా అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ సుమారు లక్షపై చిలుకు జనాభా ఉన్న అమీన్పూర్ను కేవలం రెండు వార్డులుగా విభజించారన్నారు. మరో రెండు వార్డులు పెంచాలని, ఇందుకు అససరమైతే అఖిల పక్ష కమిటీని నియమించాలని కోరారు. అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ విలీనం చేసిన సంస్థల యాక్షన్ ప్లాన్ ఏమిటీ? అదనంగా ఏమైనా బడ్జెట్ కేటాయించారా ? అని ప్రశ్నించారు. కౌన్సిల్ సభ్యులందరితో డీలిమిటేషన్ పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ప్రస్తుత వార్డుల డిలిమిటేషన్ ప్రక్రియలో చిన్న, చిన్న తప్పులు జరిగి ఉండవచ్చునని చెప్పారు.
మూసాపేట బీజేపీ కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ డీలిమిటేషన్‌కు దారుసలాంలో కూర్చొని చేశారని ఆరోపించగా, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. ఈ సందర్భంలోనే బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి మ్యాప్‌లను చింపివేశారు. మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలోనే బీజేపీ కార్పొరేటర్లు పునర్విభజకు సంబంధించి గెజిట్‌ను కౌన్సిల్లో చించి వేయడంతో కాస్త గందరగోళ వాతావరణం నెలకొనడంతో సభను మేయర్ విజయలక్ష్మి నిరవధికంగా వాయిదా వేశారు. 126 కార్పొరేటర్లు, మరో 26 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరైన ఈ సభలో పునర్విభజనపై మొత్తం 61 మంది సభ్యులు తమ అభ్యంతరాలను వెల్లడించారు. కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కొందరు మినహా మిగిలిన వారంతా పునర్విభజనను స్వాగతిస్తున్నామని స్పష్టం చేయగా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా మేయర్ వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌కు కౌన్సిల్ ఆమోదం తెలుపుతూ , ఈ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కమిషనర్‌ను ఆదేశించడం గమనార్హం.

హైకోర్టులో కేసులు.. నేటికి వాయిదా
జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాంనగర్ డివిజన్ విభజన ప్రక్రియను సవాలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగించింది. ఇతర పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాంనగర్ డివిజన్ వ్యవహారంలో చికడపల్లికి చెందిన వినయ్ కుమార్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సభలో గందరగోళం
వార్డుల పునర్విభజన విషయంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు డీలిమిటేషన్‌పై రకరకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎంఐఎంను దెబ్బ తీసేందుకే జీహెచ్ఎంసీని విస్తరించారని మజ్లిస్ పార్టీ ఆరోపించగా, దారుసలాంలో కూర్చొని డీలిమిటేషన్ చేశారని బీజేపీ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మూడు ఒక్కటే అని, గ్రేటర్లో పట్టున్న బీఆర్ఎస్ను దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. వార్డుల పునర్విభజనతో ఎంఐఎం సీట్లు పెరుగుతున్నందున మీరు పునర్విభజనపై మాట్లాడటం లేదని బీజేపీ ఫ్లోర్ లీడల్ శంకర్ యాదవ్ కౌన్సిల్లో వ్యాఖ్యానించగా, ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోక్యం చేసుకుని డీలిమిటేషన్ అభ్యంతరాలను తెలుసుకునేందుకు కౌన్సిల్ నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో పార్టీల పేర్లు ప్రస్తావించొద్దని సూచించారు. పునర్విభజన ఎంఐఎం కోసమేనన్న విషయాన్ని తాను రుజువు చేస్తామని, లేనిపక్షంలో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని శంకర్ యాదవ్ సవాలు విసిరారు. వార్డుల డీలిమిటేషన్‌పై ప్రత్యేకంగా కమిటీని నియమించాల్సిన అవసరముందని శంకర్ యాదవ్ మేయర్‌ను కోరారు. జనాభా, ఓటర్ల సంఖ్యను ఇష్టారాజ్యంగా తీసుకుని డీలిమిటేషన్ చేశారన్నారు. ఒకో డివిజన్లో 15 వేల మంది జనాభా ఉండగా, మరికొన్నింటిలో ఏకంగా 65 వేల జనాభాతో పునర్విభజించారని, ఇదెలా సాధ్యమని శంకర్ యాదవ్ ప్రశ్నించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను డివిజన్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, తోకల శ్రీనివాస్‌రెడ్డి, బొంతు శ్రీదేవి, విజయారెడ్డి, స్వామి, ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తన డివిజన్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని, ఇరుకు పొరుగు వార్డుల ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తమ వార్డుల్లో కలిపేశారని, వార్డుల పేర్లు కూడా గందరగోళంగా పెట్టారని రకరకాలుగా కౌన్సిల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ కూడా పూర్తిగా మారిపోయిందని, విలీనం, పునర్విభజనకు సంబంధించి నాకు, మేయర్‌కు కాస్త ముందస్తు సమాచారముందని ఆమె వ్యాఖ్యానించడం విశేషం.
జవహర్‌నగర్‌కు స్పెషల్ ఫండ్ ఇవ్వాలి
– ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో కలిపి అన్యాయం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గగ్గోలు పెట్టారు. మేడ్చల్ జిల్లా పురపాలికలను అభివృద్ధి చేసిన తర్వాతే జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిపి 400 మంది ఉంటే 16 వార్డులుగా చేసి రాజకీయంగా అందరి నోట్లో మట్టి కొట్టారని మల్లారెడ్డి విమర్శించారు. ఇప్పటికే 150 డివిజన్ల చెత్తను జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను బంగారు కొండ చేసి.. జవహర్‌నగర్‌ను చెత్తగా మార్చారని దుయ్యబట్టారు. జవహర్‌నగర్‌కు స్పెషల్ ఫండ్ ఇవ్వాలని ఈ సందర్భంగా మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.
గెజిట్ నోటిఫికేషన్నురద్దు చేయండి
-ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 9న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్టం 1996కు, 74 రాజ్యాంగ సవరణకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపకుండా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుగుణంగా లేదన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే 74వ రాజ్యాంగ సవరణ ఉద్దేశమని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకునే నిర్ణయాలు ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని సూచించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఒక అడ్వయిజరీ సంస్థ మాత్రమేనని, రాజ్యాంగబద్ధ సంస్థ కాదన్నారు.
ఇంత కీలకమైన రాజ్యాంగ ప్రక్రియలో సీజీజీకి నిర్ణయాధికారం అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జనాభా సుమారు 1.34 కోట్లుగా ప్రభుత్వం పేర్కొన్నదని, 300 వార్డులుగా విభజిస్తే ఒక్కో వార్డుకు సగటు జనాభా సుమారు 44, 667 ఉండాలని వివరించారు. చట్ట ప్రకారం జనాభా వ్యత్యాసం 5 నుంచి 10 శాతం మించకూడదని స్పష్టంగా ఉందన్నారు. డీలిమిటేషన్‌ను ఏ సెన్సస్ డేటాను ఆధారంగా తీసుకున్నారో, భౌగోళిక పరిణామాన్ని ఎలా పరిగణనలోకి తీసుకున్నారో ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని శ్రవణ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల డీ లిమిటేషన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలంటే రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ప్రజలతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఓటింగ్ పెట్టాలి
జీహెచ్ఎంసీ అధికారులు ల్యాప్‌టాప్‌లు ముందుకు పెట్టుకుని గూగుల్ మ్యాపులు చూసుకుంటూ విభజన చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. విభజనకు ముందు ఏ పార్టీని అడగలేదని, కార్పొరేటర్లకు సమాచారం లేదని, పునర్విభజన ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నించారు. ఒక వార్డులో ఎక్కువ జనాభా, మరోవార్డులో తక్కువ జనాభా ఉంచారని, అధికారులు ఇష్టానుసారం వార్డుల విభజన చేశారన్నారు. వార్డుల విభజనపై ఎక్స్‌ఆఫిషియో, కార్పొరేటర్లతో ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, వార్డులలో ఓటర్ల వ్యత్యాసం భారీగా ఉందన్నారు. జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అని చూడకుండా చేశారని మండిపడ్డారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా వార్డుల పునర్విభజన జరపడాన్ని ఈ సందర్భంగా తలసాని తీవ్రంగా తప్పుపట్టారు.
– మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
డీ లిమిటేషన్ జరిగిన తీరు బాగులేదు
డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తీరును మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బౌండరీస్‌ను, రోడ్ల ఆధారంగా తీసుకున్నామని అధికారులు చెబుతున్నారని, గౌతంనగర్ డివిజన్లో కాలనీలు వర్టికల్‌గా విడిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. అక్కడ రైల్వే ట్రాక్‌ను సహజ సరిహద్దుగా పరిగణలోకి తీసుకోవాలని కమిషనర్‌ను కోరుతున్నట్లు పేర్కొన్నారు. అల్వాల్ సర్కిల్ విషయానికొస్తే గతంలో మూడు డివిజన్లు ఉండగా, ఇప్పుడు ఆరు డివిజన్లుగా పెంచచారన్నారు.
మల్కాజ్గిరి వెంకటాపురం డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, బోరహ కమ్యూనిటీ, లోటస్ ఫండ్ కాలనీలను కూకట్పల్లి నియోజకవర్గంలోని హస్మత్‌పేట డివిజన్లో కలపడం పల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. అల్వాల్ సర్కిల్ ఈ కాలనీలకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉండగా, కూకట్‌పల్లికి వెళ్ళాలంటే దాదాపు 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. నేరేడ్మెట్ ప్రాంతానికి కొత్త పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
పరిపాలన కేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు
ప్రపంచంలో ఎకడా లేని విధంగా హైదరాబాద్ నగర విస్తీర్ణాన్ని విస్తరిస్తున్నారని, పునర్విభజనపై తాను తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధి, డివిజన్ల సంఖ్య పెంపు ఆశాస్త్రీయని, 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపకుండా యధావిధి స్థానాలను కొనసాగించినప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో శివారు ప్రాంతాలను మున్సిపాలిటీలలో కలుపుతూ జీహెచ్ఎంసీ పరిధి పెంచడంపై అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి కేంద్రీకరణ జరుగుతుందని వాపోయారు. 650 చదరపు కిలోమీటర్ల నగరాన్ని విస్తరించడాన్ని తప్పుపట్టారు. పునర్విభజన అంశాలను స్టడీ చేసేందుకు ఓ ప్రత్యేకమైన కమిటీని నియమించాలని కోరారు.
– ఎమ్మెల్యే కేపీ వినేకానంద్
కార్పొరేటర్ పేరు తెల్వదా?
మేయర్‌ను ప్రశ్నించిన మంగళ్‌హాట్ కార్పొరేటర్ శశికళ మేయర్ విజయలక్ష్మి, శశికళ సంభాషణ వైరల్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళ్‌హాట్ కార్పొరేటర్ పేరు మార్చి చెప్పడం వివాదాస్పదమైంది. చర్చలో భాగంగా మంగళ్‌హాట్ కార్పొరేటర్ శశికళను మేయర్ సునీతగా సంబోధించారు. స్పందించిన శశికళ మేయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన పేరు సునీత కాదని.. శశికళ అన్నారు. నగర మేయర్‌కు సహచర కార్పొరేటర్ పేరు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందిస్తూ బీజేపీ పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ ఆమె పేరును సునీత అని చెప్పారని అన్నారు. అదేవిధంగా పేరు తప్పుగా పలికినందుకు క్షమాపణలు చెప్పారు. మేయర్, కార్పొరేటర్ శశికళ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరలయింది.
అభ్యంతరాలు
తేదీ : ఫిర్యాదులు
10 : 40
11 : 280
12 : 373
13 : 408
14 : 227
15 : 1774
16 : 1475
మొత్తం : 4577