సిటీబ్యూరో, జనవరి (నమస్తే తెలంగాణ): స్నాప్‌చాట్‌లో పరిచయమైన యువతిని పోలీసులమంటూ బెదిరించి రూ.48.38లక్షలు టోకరా వేసిన ముగ్గురు ఘరానా సైబర్ నేరగాళ్లను నగర సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, వివిధ బ్యాంక్‌లకు చెందిన ఐదు పాస్‌బుక్కులు, ఐదు డెబిట్ కార్డులు, ఒక క్రెడిట్ కార్డు, మూడు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌క్రైమ్ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం.. నగర యువతికి స్నాప్‌చాట్‌లో పరిచయమైన అమన్‌జోషి నమ్మకంగా వ్యవహరిస్తూ రూ.15వేలు అప్పుగా తీసుకున్నాడు.
ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించకపోగా తన అనుచరులైన ప్రశాంత్ బిరాదర్, రోహిత్ శర్మతో కలిసి ఆ యువతి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకోవాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా రోహిత్ యువతికి ఫోన్‌చేసి తాము క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులమని, ‘అక్రమ బంగార వ్యాపారం చేసే అమన్ జోషికి మీకు సంబంధాలున్నాయని, త్వరలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం’ అని బెదిరించాడు. బెయిల్ కోసం రూ.1.60 లక్షలు ఇవ్వాలని తొలుత చెప్పిన రోహిత్ ఆ తర్వాత రూ.2 లక్షలకు పెంచాడు. అయితే ఎక్కడ తన కెరీర్ దెబ్బతింటుందో అన్న భయాందోళనకు గురైన యువతి రోహిత్ అడిగిన నగదును ఆన్లైన్ ద్వారా పంపింది.
కానీ ఇంతటితో ఆగకుండా ఆ యువతిని తరచూ వేధిస్తూ రూ.48.38 లక్షల వరకు దోచేశారు. దీంతో బాధితురాలు గత సంవత్సరం ఆగస్టు 22న నగర సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడైన అమన్జోషితో పాటు అతడికి సహకరించిన ప్రశాంత్, రోహిత్ శర్మను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్.నరేష్, ఎస్ఐ బి.మన్మోహన్గౌడ్, హెడ్‌కానిస్టేబుల్ ఎం.వెంకటేష్, మహ్మద్ ఫిరోజ్, కానిస్టేబుళ్లు ఎ.రవికుమార్, ఎల్.తిరుమలేష్, ఎండీ ఇలియాస్ అలీలు నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.