బంజారాహిల్స్,మే 18: సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుని క్రమపద్ధతిలో అమలు చేయడం ద్వారా డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమగ్ర డిజిటల్ విద్యాసంస్థగా పరిణామం చెందే దిశలో ముందడుగు వేస్తోందని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.ఘంటా చక్రపాణి అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీ ప్రాంగణంలో ‘విద్యావారోత్సవాలు’ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ..అత్యున్నత విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సాంప్రదాయ విద్యా కార్యక్రమాలతో పాటు ఉపాధి ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు.
మరింత మెరుగైన విద్యాబోదన అందించే క్రమంలో ఇనిస్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్(ఐడీపీ) ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్పాచక్రపాణి, రిజిస్ట్రార్ డా.ఎల్.విజయకృష్ణారెడ్డి, ఓఎస్డీ ప్రొ.రవీంద్రనాథ్ సోలమన్ తదితరులు పాల్గొన్నారు.