వెంగళరావునగర్, నవంబర్ 23: వంటింట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. గ్యాస్ స్టౌ వెలిగిస్తుండగా..అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఓ మహిళ సజీవ దహనమవగా..కాపాడేందుకు యత్నించిన ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ కమాన్ గల్లీలో ఘటన చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ధూల్‌పేట్‌కు చెందిన సోనుబాయి(36) రహ్మత్‌నగర్ కమాన్ గల్లీలోని తమ పుట్టింటికి వచ్చింది. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కోసం పుట్టింటివారి పిలుపుతో శనివారం ఇక్కడికి వచ్చింది. జీ ప్లస్ ఒన్లోని ఇంట్లో ఇల్లంతా బంధులతో కళకళలాడసాగింది. పిండి వంటలు వండేందుకు సోనుబాయి స్టౌ వెలిగించింది.
అప్పటికే వంటిల్లు అంతా గ్యాస్‌తో నిండిపోయి ఉండటంతో ఒక్కసారిగా పెద్ద పేలుడుతో మంటలు చలరేగాయి. సోనుబాయి ఆ మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీసింది. కళ్లెదుటే కన్నబిడ్డ మంటల్లో చిక్కుకోవడంతో కాపాడేందుకు యత్నించిన ఆమె తల్లిదండ్రులు, సోదరుడు అజయ్ గాయాలపాలయ్యారు. 90 శాతం కాలిన గాయాలతో సోనుబాయి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బం ది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయాలపాలైన ఆమె తల్లిదండ్రులను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
గ్యాస్ లీకై మంటల్లో కాలిపోయిన బాధిత కుటుంబాన్ని వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మృతురాలి కుటుంబాని కి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని..ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు వైద్య సాయం అందించాలని కోరారు.