సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): గ్యాస్ సిలిండర్ కొరత ఆహార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఓ వైపు గ్యాస్ సరిపడా ఉందని ప్రజలు ఆందోళన చెందొద్దని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ కొరత కారణంగా ఫుడ్ ఇండస్ట్రీ కుదేలవుతున్నది. పెండ్లీలు, బర్త్‌డే, ఇతర పార్టీలు నిర్వహించుకోవాలనుకునే వారికి ఖర్చులు పెరుగుతున్నాయి. సిలిండర్ల లభ్యత లేదని మీరే సిలిండర్లు సమకూర్చితే వండి పెడతాం అంటూ కేటరింగ్ సంస్థలు చెప్పేస్తున్నాయి. సిలిండర్ సమకూర్చితే ఒక రేటు.. లేకపోతే మరో ధర అంటూ విభజించారు. కూకట్‌పల్లికి చెందిన ఓ కేటరింగ్ సంస్థ ఒక్క ప్లేట్‌కు రూ.350 వసూలు చేసేది.
ఇప్పుడు ఆ సంస్థ రూ.450 చేసింది. గ్యాస్ సిలిండర్లు సరిపడా లేకపోవడాన్ని ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నాయి. అంతేకాదు ఏ వారం ఈవెంట్‌ను ఆ వారమే నిర్ణయించి ఒప్పుకుంటామని ముందుగా ఓకే చేసే పరిస్థితులు లేవని అంటున్నారు. ఆ ఈవెంట్ సమయంలో గ్యాస్ కొరత, డిమాండ్‌ను ఆధారంగా ధరలు ఉంటాయని చెబుతున్నారు. నగరంలో వాణిజ్య గ్యాస్ ధర రూ. 3 వేల నుంచి 5 వేల వరకు బ్లాక్ మార్కెట్ నడుస్తున్నదని వినియోగదారులు చెబుతున్నారు. కొన్ని ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ నడుపుతుండటంతో ఫుడ్ ఇండస్ట్రీ వాటిని కొనుగోలు చేయలేకపోతున్నాయి. దీంతో వాళ్లు ఎలాంటి ఆర్డర్స్ తీసుకోవడం లేదు.
బంజారాహిల్స్‌కు చెందిన ఓ కేటరింగ్ సంస్థ సిలిండర్లు సమకూర్చితే ఆర్డర్ తీసుకుంటామని చెబుతున్నది. ఒక వేళ ఆర్డర్ ముందుగానే అంగీకరిస్తే తీరా ఈవెంట్ సమయానికి సిలిండర్ కొరత ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. అందుకే గ్యాస్ సిలిండర్లు సమకూర్చితే ఎంతమందికైనా కేటరింగ్ ఆహారం రెడీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన స్వప్న కేటరింగ్‌కు చెందిన నిర్వాహకురాలు మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా అన్ని ఐటెంలు సమకూర్చలేకపోతున్నామని.. ఇప్పటికే కొన్ని ఐటెంలను తగ్గించామని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు ఆర్డర్స్ తీసుకోవడం లేదన్నారు. ధరలు ఎక్కువ చెబితే కస్టమర్లు కూడా అంగీకరించడం లేదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ సిలిండర్ల మీదనే తమ వ్యాపారం ఆధారపడి ఉందని వాపోయారు. అధికారులు బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.