సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : మొన్న శ్మశాన వాటిక.. నిన్న ఓ గోదాం.. ఇప్పుడు ఓటీపీ మోసాలు.. సిలిండర్లను పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి గ్యాస్ ఏజెన్సీలు తమ చేతివాటం చూపిస్తున్నాయి. మీకు ఓటీపీ వచ్చిందని అమాయకులకు ఎరవేసి బ్యాంక్ ఖాతాల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టే సైబర్ నేరస్తులను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు అదే ఓటీపీ మోసాలతో గ్యాస్ సిలిండర్లను దోచుకుంటున్న వైనం కలకలం రేపుతున్నది.
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ఏర్పడిన ఇంధన కొరతతో నగరంలో సిలిండర్లకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ బుకింగ్ చేసి నెలరోజులు గడిచినా సిలిండర్ అందడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీలు వినియోగదారులకు అందాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. అందులో భాగంగానే ఏజెన్సీలు కొన్ని బ్లాక్ దందా ముఠాను నియమించుకున్నాయి.
ఎవరైతే ఇప్పటికే గ్యాస్ బుకింగ్ చేసుకున్నారో వారికి ఫోన్ చేసి ఓటీపీలు చెప్పాలంటూ అడుగుతున్నారు. సిలిండర్ వచ్చాక కదా ఓటీపీ చెబుతామంటే.. లేదు ఓటీపీ చెబితేనే సిలిండర్ వస్తుందని లేకపోతే క్యాన్సల్ అవుతుందని అనడంతో చాలా మంది ఓటీపీలు చెప్పేస్తున్నారు. దీంతో వారి సిలిండర్లను బ్లాక్ దందాకు తరలిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ను రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నారు. వాణిజ్య సిలిండర్‌ను రూ.4-5వేల వరకు అమ్మేస్తున్నారు. ఒక్కో ఏజెన్సీ రోజుకు ఇలా సరాసరి 50-70 గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. అంటే ఈ లెక్కన ఒక్క ఏజెన్సీ సుమారు రెండు లక్షల రూపాయలను బ్లాక్ మార్కెట్లో కొల్లగొడుతున్నది. వాణిజ్య సిలిండర్లతో కలిపి నెలకు సుమారు 50-70 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
గ్యాస్ ఏజెన్సీలను పర్యవేక్షించాల్సిన ఏఎస్ఓలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఓవైపు కలెక్టర్ ఇంధన సరఫరా సరిపడా ఉందని చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. డీఏపీ నెంబర్లు వచ్చినప్పటికీ బిల్లింగ్ ప్రక్రియ పూర్తైనా సిలిండర్లు వినియోగదారులకు ఇవ్వడం లేదు. అదేంటని అడిగితే సిలిండర్ల కొరత ఉందని చెబుతున్నారు. ఓ వినియోగదారుడు డబ్బులు చెల్లించి, డీఏపీ నంబర్ వచ్చినప్పటికీ సిలిండర్ ఎందుకు ఇవ్వరు అని అడిగితే “ఎక్కువ మాట్లాడితే సిలిండర్ కనెక్షన్ రద్దు చేస్తా’ అంటూ ఏజెన్సీ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారు.
నగరంలో శుక్రవారం పలు ఏజెన్సీల్లో వినియోగదారులు తమకు సిలిండర్ బుకింగ్ నంబర్ వచ్చిందని, ఓటీపీ అడిగారని చెబుతూ వందల సంఖ్యలో ఏజెన్సీలను ఆశ్రయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ సిలిండర్లన్నీ ఎటు వెళ్లాయి? ఎవరికీ పంపించారు? ఎంత డబ్బులు వసూలు చేశారు? అని వినియోగదారులు సిబ్బందిని ప్రశ్నించారు. వారు తమకు సబంధం లేదని, ఓటీపీలు మీరెందుకు చెప్పారంటూ బెదిరించే యత్నం చేశారు. ఏజెన్సీలు చేస్తున్న మోసాలపై సంబంధిత ఏఎస్‌ఓలకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
సాంకేతిక సమస్యలను బూచిగా చూపి ఏజెన్సీ సిబ్బంది చాలా మంది కస్టమర్లను వెనక్కి పంపిస్తున్నారు. సిలిండర్ బుకింగ్ మినహా ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు. కేవైసీ, బయో మెట్రిక్, చిరునామా మార్పు తదితర పనులపై వచ్చే వినియోగదారులకు సర్వర్ డౌన్ అంటూ చెప్పి పంపిస్తున్నారు. బ్లాక్ రూట్లో వచ్చే వారి పనులు చేస్తున్నారని ఓ వినియోగదారుడు ఆరోపించాడు. సిలిండర్ డబ్బులు చెల్లించినప్పటికీ వారి సర్వర్‌లో అప్డేట్ కాలేదంటూ బిల్లింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. సాకులతో సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి డబ్బు చేసుకుంటున్నారు.
మేడ్చల్, (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో వాణిజ్య సిలిండర్ ధర ఎకంగా రూ. 6 వేలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 20 కిలోలు ఉండే వాణిజ్య సిలిండర్ ధర రూ. 21 వందలు ఉండగా, ప్రస్తుతం మూడింతలు పెంచి మరి డిమాండ్‌తో బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 52 వివిధ గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. గ్యాస్ కొరత లేదని అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ వంట గ్యాస్ కోరత తీవ్రంగా కనిపిస్తున్నది. గ్యాస్ కొరత లేనట్లయితే సిలిండర్లను బుక్ చేసుకున్న 25 రోజుల వరకు ఇంటికి రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులును ఎదుర్కొంటున్నారు. వంట గ్యాస్ సిలిండర్లపై ఇంత ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు ఏజెన్సీలపై కన్నెత్తి చూడటం లేదు. ఫోన్ చేస్తే కనీసం ఎత్తక పోగా, ఎత్తితే మాత్రం విసుగుగా సమాధానం ఇస్తున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.