GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో చెత్త రహిత నగరంగా రోడ్లపై ఎక్కడా గార్బేజ్బిన్లు లేకుండా చూస్తే ఈ ప్రభుత్వం చెత్త డబ్బాలను తిరిగి ఏర్పాటు చేయనుంది. చెత్త రహిత నగరమే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి.
ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త పేరుకుపోతున్నది. ప్రధానంగా జీవీపీ (తరచూ చెత్త వేసే ప్రాంతాలు) పాయింట్ల ఎత్తివేతలో జీహెచ్ఎంసీ విఫలం చెందింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ రోడ్లపై డంపర్ బిన్లు (చెత్త డబ్బాలు) ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లకు గానూ 1000 డంపర్ బిన్లను కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే చార్మినార్లో 115, ఖైరతాబాద్ జోన్లో ఆరు ప్రాంతాల్లో డంపర్ బిన్లు (స్మార్ట్ బిన్లు)ను ఏర్పాటు చేశారు.
కాగా స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చేసేందుకుగానూ డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త డబ్బాలను ఎత్తివేసింది. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల వెంబడి చెత్త డబ్బాలను దాదాపు 800 చోట్లకుపైగా తగ్గించే కార్యక్రమాలను పక్కాగా ఆమలు చేసింది. పెరిగిన జనాభా, కాలనీలలో చెత్త ఉత్పత్తి పెరిగినప్పటికీ అందుకు అనుగుణంగా తరలించే స్వచ్ఛ ఆటోలు, వాహనాలను పెంచుతూ వచ్చారు. వీధి వ్యాపారులు (స్ట్రీట్ వెండర్స్) తప్పనిసరిగా డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ గ్రేటర్ రోడ్లపై డంపర్ బిన్లు తెరపైకి తీసుకురావడం, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో భాగంగా మార్కులు తగ్గుతాయని తెలిసిన ఈ డంపర్ బిన్లు ఏర్పాటు చేయడం గమనార్హం.