Hyderabad | బడంగ్పేట్, జూన్ 15: అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, లెనిన్ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో గంజాయి రాయుళ్లు స్వైర విహారం చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి సేవించిన మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. పాఠశాలలో ఉన్న లైట్లు, ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు ధ్వంసం చేస్తున్నట్లు ఉపాధ్యాయుల పేర్కొంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగేందుకు ప్రయత్నం చేస్తున్న తమపై గంజాయి రాయుళ్లు ఎదురుదాడికి పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం, వాటర్ పైప్ లైన్లు, నల్లాలను సైతం ఎత్తుకుపోయినట్లు టీచర్లు పేర్కొంటున్నారు.
జిల్లాలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు లక్షల వరకు నష్టం జరిగినట్లు మండల విద్యాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. గంజాయి రాయుళ్లు చేస్తున్న అరాచకాలపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా టీచర్లకు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతుందని వాపోయారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శిర్లాహిల్స్ లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సైతం సైతం ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నట్లు టీచర్లు పేర్కొంటున్నారు. గంజాయి సేవిస్తున్న వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు రక్షణ లేకపోతే ఇక సుదూర ప్రాంతాలలో ఉన్న పాఠశాలల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఉపాధ్యాయులు ఫిర్యాదులు చేస్తున్న పోలీసులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి రాయుళ్లు ప్రభుత్వ పాఠశాలలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని పదేపదే చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా సత్ఫలితాలు వచ్చిన సందర్భాలు కనిపిస్తలేవు. ప్రభుత్వ పాఠశాలలే కాకుండ, చెరువుల సమీపంలోనూ గంజాయి రాయుళ్లు తిష్ట వేస్తున్నారని కాలనీవాసుల నుంచి సైతం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా గంజాయి రాయుళ్లను నియంత్రించడంలో పోలీసులు విఫలం చెందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులకు స్పందించి గంజాయి రాయుళ్లపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై పలు అనుమానాలకు తావిస్తున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.
పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం : ఎంఈవో కృష్ణయ్య
జిల్లెల్లగూడ చల్లాలింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గంజాయి రాయుళ్లు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. లైట్లు, సీసీ కెమెరాలు, పైపులు ధ్వంసం చేశారు. రెండు లక్షల వరకు నష్టం జరిగింది. మళ్లీ రూ. 1,50,000 పెట్టి అన్ని రిపేర్ చేయించాం. మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ కల్పించాలి. సాయంత్రం అయిందంటే గంజాయి రాయుళ్లు తిష్ట వేస్తున్నారు అని ఎంఈవో పేర్కొన్నారు.