Ikea | సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా ఆన్లైన్ ద్వారా సరఫరా చేస్తున్న గంజాయిని ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియాకు చెందిన ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం… నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన చితారి మహేశ్, డి.సిద్ధులు నగరంలోని ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియాలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ ఉద్యోగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. సదరు ఉద్యోగులు స్నాప్‌చాట్ వంటి యాప్‌ల ద్వారా ఆన్లైన్లో ‘జాయింట్’, ‘కోర్’, ‘గ్రీన్’ వంటి కోడ్ భాషలతో గంజాయిని బుక్ చేసుకుంటారు. దీంతో ఆన్లైన్ సరఫరాదారులు స్నాప్‌చాట్ ద్వారా ఐకియాలో పనిచేసే డ్రైవర్లు చితారి మహేశ్, సిద్ధులకు ఎక్కడికి రావాలో సమాచారం అందిస్తారు. అమ్మకందారుల సూచన మేరకు ఐకియా డ్రైవర్లు అక్కడికి వెళ్లి గ్రాము గంజాయి ప్యాకెట్‌ను రూ.300 చొప్పున కొనుగోలు చేస్తారు.
వాటిని ఐకియా వాహనంలో డ్రైవింగ్ సీటు కింద పెట్టుకుని నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో పరిచయమున్న ఐటీ ఉద్యోగులకు రూ.500 చొప్పున విక్రయిస్తారు. అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు గచ్చిబౌలి, టెలికామ్నగర్ పార్క్ వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఐకియా వాహనంలో 1.2కిలోల గంజాయి లభించింది. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.1.12కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ జ్యోతి, హెడ్‌కానిస్టేబుల్ అలీమ్, కానిస్టేబుళ్లు లేఖసింగ్, కార్తిక్, రాంచందర్ ఉన్నారు.
ఆదిలాబాద్ కేంద్రంగా ధూల్‌పేట మచిలీపురా ప్రాంతానికి చెందిన ఇందర్పాల్సింగ్ ఆదిలాబాద్ నుంచి ధూల్‌పేటకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. ఎస్టీఎఫ్ పోలీసులు శుక్రవారం ఇందర్పాల్సింగ్ ఇంటిపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఇందర్పాల్సింగ్తోపాటు కపూర్సింగ్ను అరెస్టు చేసి, 8.6కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సబల్కరమ్పై కేసు నమోదు చేశారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న కునాల్సింగ్ను అరెస్టు చేయగా, గంజాయి వినియోగిస్తున్న మహేశ్‌తోపాటు మరో 10 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుకున్న వారిలో ఎస్టీఎఫ్ సీఐ మధుబాబు, గోపాల్, ఎస్ఐలు భాస్కర్‌గౌడ్, లలిత, మహేశ్వర్, సైదులు, హెడ్‌కానిస్టేబుళ్లు భాస్కర్‌రెడ్డి, అజీమ్, శ్రీధర్, కానిస్టేబుళ్లు ప్రకాశ్, రాకేశ్, మహేశ్ పాల్గొన్నారు.