సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): స్నాచింగ్‌లు.. దొంగతనాలతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ వేల దొంగతనాలు జరుగుతాయని ముందస్తుగానే పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.. అయితే అందుకు తగ్గట్టుగా పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయకపోవడంతో దొంగలు స్వైర విహారం చేశారు. ఎల్బీనగర్ జోన్లో స్నాచర్లు విరుచుకుపడగా… ఉప్పల్ జోన్లో వరసగా ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. అలాగే సైబరాబాద్ పరిధిలో మరికొన్ని చోట్ల కూడా స్నాచింగ్, దొంగతనాలతో ప్రజలను భయాందోళనకు గురిచేశారు.
దీంతో ఈ ముఠాలను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. చైతన్యపురి ఠాణా పరిధిలో రెండు ఘటనలు, హయత్‌నగర్‌లో ఒకటి, నాగోల్‌లో మరొక స్నాచింగ్ ఘటన శనివారం జరుగగా, అంతకు ముందు రోజు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో స్నాచింగ్‌లు జరిగాయి. అలాగే మేడిపల్లిలో 8 ఇండ్లలో వరుస దొంగతనాలు చోటు చేసుకున్న మరుసటి రోజే ప్రతాపసింగారంలోను వరుసగా మూడు ఇండ్లలో దొంగతనాలు జరిగాయి.
బీఆర్ఎస్ హయంలో అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేశారు. స్నాచింగ్‌లు, దొంగతనాలకు హైదరాబాద్ వైపు రావాలంటేనే అంతర్రాష్ట్ర ముఠాలు వణికిపోయే పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా ఒకే రోజు 10 స్నాచింగ్‌లు జరిగిన సందర్బాలున్నాయి. ఆనాడు మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే తప్పని సరిగా కొంగు కప్పుకొని వెళ్లాలంటూ పోలీసులే స్వయంగా సూచనలు చేసేవారు. అలాంటి పరిస్థితిని గుర్తించి చైన్‌స్నాచింగ్ ఘటన జరగకుండా బీఆర్ఎస్ హయంలో పకడ్బందీ ప్రణాళికలతో నేరస్థుల ముఠాలను కట్టడి చేశారు.
బీఆర్ఎస్ హయంలో 10 ఏండ్లపాటు స్నాచింగ్‌లు, దొంగతనాలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో మహిళలు స్వేచ్చగా రోడ్లపై తిరిగారు. నేరాలు జరగకుండా నిరంతరం పెట్రోలింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, నగరంలోకి దొంగలు వచ్చారంటే పక్కాగా దొరికిపోయేలా సీసీకెమెరాలను ఏర్పాటు చేసి నేరస్థుల్లో హైదరాబాద్‌కు వెళ్తే ఎట్టి పరిస్థితులలోను దొరికపోతామనే భయాన్ని క్రియేట్ చేశారు. దొంగతన జరుగొద్దు… ఒక వేళ జరిగితే 24 గంటల్లో ఆయా కేసులను ఛేదించి నిందితులను పట్టుకోవాలనే పట్టుదలను ఉన్నతాధికారులు ఎప్పకటిప్పుడు కిందిస్థాయి సిబ్బందికి దిశా నిర్ధేశం చేసేవాళ్లు.
అందుకు తగ్గట్టుగానే నేరాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు నేరం జరిగితే నేరస్థులు ఎంత దూరం వెళ్లినా ట్రై కమిషనరేట్ల సమష్టి కృషితో వెంటనే ఆయా కేసులను ఛేదించేవారు. కానీ నేడు పరిస్థితిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థ అంతా నిద్రావస్థలోకి వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి. మళ్లీ అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌కు రావడం మొదలైంది. తరుచూ స్నాచింగ్‌లు, దొంగతనాలు, దోపిడీ ఘటనలకు పాలప్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు.
శివారు ప్రాంతాలతోపాటు నగరంలోని కీలకమైన ప్రాంతాలలోను పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయండి మహాప్రభో అంటూ స్థానిక ప్రజలు వేడకుంటున్న పరిస్థితి నెలకొంటుంది. క్షేత్ర స్థాయిలో నిరంతరం పెట్రోలింగ్ వ్యవస్థ పనిచేస్తుండడంతో విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. దీంతో పోలీసుల నిఘా ఉందని, నేరం చేస్తే దొరికిపోతామని భయం నేరస్థులలో ఉంటుంది.
కాని పెట్రోలింగ్ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది… క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, సామాన్య ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టారని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. వరుస స్నాచింగ్‌లు, దొంగతనాలతో పోలీసులకు సవాళ్లు విసురుతున్నా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళికలను పోలీసులు అమలు చేయలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.