మణికొండ, జూన్ 22: మంచిరేవుల మూసీ పరీవాహక ప్రాంతంలో వెలసిన అక్రమ నిర్మాణాలను గండిపేట రెవెన్యూ అధికారులు సోమవారం నేలమట్టం చేశారు. సర్వేనెంబరు 327,328,329లలో సుమారు ఎకరం భూమిని ఆక్రమించడంతో పాటు ఆ ప్రాంతాలల్లో ఫాంహౌస్‌లు, ఇండ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. గత కొన్నిరోజుల కిందట కాంగ్రెస్ నేత, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బఫర్, మూసీ రివర్ బెడ్‌ను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించుకున్నారు.
కాగా, ఇటీవల ఆ ఫాంహౌస్‌ను ఓ ప్రైవేటు పాఠశాలకు లీజ్‌కు ఇచ్చి పక్కనే ఉన్న మూసీ రివర్ బెడ్‌ను ఆక్రమించి రేకుల షెడ్డులు నిర్మిస్తుండటంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు.. ఆ నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఈ క్రమంలో ఆక్రమదారులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో నిబంధనలను అతిక్రమించి నిర్మించిన వారికి నోటీసులు జారీ చేశామని.. అయినా వారు వాటిని బేఖతారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆక్రమణల్లో దేవాదాయ శాఖ, మూసీ బఫర్కు చెందిన భూమి ఎకరం వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఈ అక్రమాలపై సదరు కాంగ్రెస్ నేత కుమారుడే స్వయంగా జిల్లా కలెక్టర్‌కు, రెవెన్యూ అధికారులకు తన తండ్రి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ.. ఫిర్యాదులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఫిర్యాదు చేసుకొని.. కూల్చివేయడం వెనుక ఆంతర్యమేమిటీ..?
మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ నేత ఫాంహౌస్‌ను కూల్చివేస్తున్నట్లుగా తెరవెనుక ఏదైనా ప్లాన్‌తోనే చేసిందా? లేక ఫిర్యాదులు చేయించుకుని ప్రజలకు పరోక్షంగా సంకేతం పంపిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సదరు కాంగ్రెస్ కుమారుడే రెవెన్యూ అధికారులకు స్వయంగా ఫిర్యాదు చేసి తన తండ్రి ఆక్రమణలకు పాల్పడుతున్నాడంటూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కోణమా? లేక సాధారణమేనా అనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయి. మా నేత ఫాంహౌస్ కూల్చివేశామంటూ ప్రగల్బాలు పలికేందుకు సర్కారు కుట్రలో భాగమేనా? అంటూ మూసీ బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఆక్రమణదారులకు పోలీసుల వత్తాసు!
మంచిరేవుల గ్రామంలోని సర్వే నెంబరు 327,328,329లలోని మూసీ పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టేందుకు పోలీసుల బందోబస్తుతో రాగా నార్సింగి పోలీసులు అక్రమదారుల పక్షాన వ్యవహిస్తున్నారంటూ రెవెన్యూ అధికారులు ఆరోపించారు. అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు రెవెన్యూ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నా అక్కడే ఉన్న నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి వారి ఆపాల్సింది పోయి అధికారులపైకి పంపిస్తున్నారంటూ కొంతమంది రెవెన్యూ సిబ్బంది వాపోయారు. ఇంత భారీ అక్రమం తాము కూల్చివేస్తుంటే బందోబస్తు చేపట్టాల్సిన అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతుంటే.. మా పనులు ఏవిధంగా ముందుకు సాగుతాయంటూ పోలీసుల తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.