మణికొండ, జూలై 10 :చారిత్రాత్మక జలాశయమైన గండిపేట చెరువు కాండూట్ శిథిలావస్థకు చేరుకున్నది. గండిపేట చెరువు నిర్మించి శతాబ్ధ కాలం పూర్తి కావడంతో అప్పట్లో నిర్మించిన కాలువ ప్రస్తుతం శిథిలమై ఎక్కడికక్కడ చిల్లులు పడి నగరానికి తరలించే తాగునీరు రోడ్డుపాలవుతున్నది. గత కొన్ని రోజులుగా ఈ సమస్యపై స్థానిక ప్రజలు వివిధ కాలనీల నాయకులు ప్రతినిధులు జలమండలి శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీర స్థాయిలో మండిపడుతున్నారు.
కేవలం వ్యాపార ధోరణిని తప్ప మరే ఇతర అధికార వ్యవహారాల్లో జలమండలి శాఖ అధికారులు పనిచేయడం లేదని స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గురువారం మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు చారిత్రాత్మక గండిపేట జలాశయ కాండూట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు అందే లక్ష్మణరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పట్లోళ్ల రూపా రెడ్డి మాట్లాడుతూ ఉస్మాన్‌సాగర్ నుంచి రోజుకు 26 మిలియన్ గ్యాలన్ల నీటిని ఓపెన్ కాండూట్ గ్రావిటీ ద్వారా కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, షేక్‌పేట, హకీంపేట మీదుగా ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ వరకు సరఫరా జరుగుతున్నదని తెలిపారు.
ఈ కాండూట్ లీకేజీల విషయంపై అనేకసార్లు మణికొండ జలమండలి శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా వారు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టరీత్యా ప్రజల అన్ని అవసరాలకు నీటిని సరఫరా చేయడం విధిగా ఉన్నా కేవలం తాగు నీటిని సరఫరా చేస్తామనడం ఎంత వరకు సబబో అధికారులు తెలియాలని మణికొండ నాయకులు డిమాండ్ చేస్తూ, ప్రజలకు తాగునీటి సరఫరాకు సరిపడా నీరు లేదని చెబుతూ, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ వ్యాపార ధోరణితో అధికారులు వ్యవహరిన్నారని ఆరోపించారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజల అవసరార్థం చర్యలు తీసుకోవాలని మణికొండ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, రాజేంద్ర ప్రసాద్, రూపా రెడ్డి, సంగం శ్రీకాంత్, యాలల కిరణ్, సుమ నళిని, ముత్తంగి లక్ష్మయ్య, నర్సింగరావు, మంజుల, అనూష, రాజు, బాలాజీ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.