Gandhi Hospital | సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట, ఏప్రిల్22, (నమస్తే తెలంగాణ): పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నిర్మించిన ఆరు థియేటర్లు నిర్మాణపు పనులు 95శాతం పూర్తయి అతి త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
గాంధీ అసుపత్రిలో నోడల్ అవయవదాన మార్పిడి కేంద్రాన్ని రూ.35 కోట్లతో నెలకొల్పేందుకు 2022లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవ మార్పిడి కోసం రూ.లక్షల్లో అప్పులు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవయవమార్పిడిలు చేయించుకోవడం గమనించిన కేసీఆర్ అవసరమైన ప్రతి పేదోడికి ఉచితంగా అవయవమార్పిడి సేవలందించాలని నిర్ణయించారు.
నాటి వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గాంధీ ఆసుపత్రిలోని 8వ అంతస్తులో అవయవమార్పిడి కేంద్రం ప్రారంభించేందుకు వెనువెంటనే రూ.35 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతానికి 95శాతం పనులు పూర్తికాగా మరో పదిహేను రోజుల్లో గాంధీలోని అవయవమార్పిడి కేంద్రం అందుబాటులోకి రానున్నది.
అవయవాల మార్పిడికోసం ఆరు మాడ్యులర్ ఆపరేషన్ థీయేటర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి మూడు వివిధ రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. పీజీ విద్యార్థులకు వైద్యవిద్యలో భాగంగా ఆపరేషన్ థియేటర్లో నిర్వహించే అవయవ మార్పిడి చికిత్సను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేశారు. వీటిల్లోనే నేరుగా దాత నుంచి గ్రహీతకు అవయవాన్ని అమర్చనున్నారు.