నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది గాంధీ దవాఖాన. ప్రతి రోజు దాదాపు 2000 నుంచి 3000 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారు. అందులో కంటి సమస్యలకు సంబంధించి 200 నుంచి 300 మంది వరకు ఆప్తమాలజీ విభాగానికి వస్తున్నారు. వారిలో కనీసం 10 నుంచి 20 మంది క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న వారే ఉంటున్నారు.
-సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర వ్యాప్తంగా కంటి సమస్యల కోసం ప్రత్యేకంగా సరోజిని దేవి కంటి దవాఖాన అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత రోజుల్లో కంటి సమస్య బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో ఆప్తమాలజీ విభాగాలను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా జిల్లా స్థాయి దవాఖానలు, ఏరియా దవాఖానల్లో సైతం వీటిని నెలకొల్పింది.
ప్రతి నెలా 50మందికి..
కరోనా తరువాత గాంధీ దవాఖానలో పునఃప్రారంభమైన ఆప్తమాలజీ విభాగానికి క్రమంగా రోగుల తాకిడి పెరుగుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. నెలకు కనీసం 50 క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో సుమారు 500 వరకు ఆపరేషన్లు జరిగినట్లు తెలిపారు.
ఉచితంగానే అద్దాలు, మందులు..
క్యాటరాక్ శస్త్రచికిత్సతో పాటు రోగులకు అవసరమైన మందులు, కంటి అద్దాలను పూర్తి ఉచితంగానే అందజేస్తున్నారు. శస్త్రచికిత్స తరువాత దాదాపు రెండు మూడు నెలల పాటు ఐ డ్రాప్స్, ఇతర మందులు వాడాల్సి ఉంటుంది. అయితే వాటిని సైతం ఉచితంగానే అందిస్తున్నారు.
మెరుగైన చికిత్స అందిస్తున్నాం
గాంధీ దవాఖాన ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రభుత్వ రంగ వ్యవస్థలో కార్పొరేట్‌కు దీటుగా అన్ని విభాగాలతో ఇక్కడ సేవలు అందిస్తున్నాం. కంటి చికిత్సకు ప్రత్యేకంగా ఆప్తమాలజీ విభాగం ద్వారా సేవలు అందిస్తున్నాం. కరోనా ప్రభావం వల్ల దాదాపు రెండు సంవత్సరాల అనంతరం ఈ విభాగాన్ని పునఃప్రారంభించాం. నయా పైసా ఖర్చులేకుండా శస్త్రచికిత్సతో పాటు తదనంతర చికిత్స, కంటి అద్దాలు వంటి వాటిని సైతం ఉచితంగా అందిస్తాం.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన