Monkeypox | హైదరాబాద్ : కరోనా వైరస్ అనంతరం ఎలాంటి వైరస్లు వచ్చినా జనాలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మంకీపాక్స్ అనే వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచనల మేరకు తెలంగాణ సర్కార్ సైతం మంకీపాక్స్‌ను ఎదుర్కొనే దిశగా ముందస్తు చర్యలు ప్రారంభించింది.
రాష్ట్రంలో ఒక వేల కేసులు నమోదైతే చికిత్స అందించేందుకు గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్స్‌ను నోడల్ కేంద్రాలుగా ప్రకటించింది. గాంధీలో 14 పడకలతో కూడిన మంకీపాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. ఎక్కడైన మంకీపాక్స్ కేసులు నమోదైనా లేక అనుమానిత లక్షణాలున్నా ఆ రోగులకు ఈ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించనున్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్‌కుమారి వెల్లడించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వార్డులను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదని, ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు మంకీపాక్స్ వార్డులను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డా.రాజ్‌కుమారి స్పష్టం చేశారు. ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స అంటూ ఏమి లేదని, సపోర్టింగ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుందన్నారు.
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో సైతం ముందుజాగ్రత్త చర్యగా 6 పడకలతో మంకీపాక్స్ వార్డును ఏర్పాటు చేసినట్లు దవాఖాన ఆర్ఎంవో డా.జయలక్ష్మి తెలిపారు. మంకీపాక్స్ బాధితులకు, అనుమానిత లక్షణాలున్న వారికి నిర్ధారణ పరీక్షలు చేసి, ఈ వార్డులో చికిత్స అందించేందుకు అన్నిరకాల ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులుగాని, అనుమానిత కేసులు గాని రాలేదని, కేవలం ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే ఈ వార్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజాపాలనలో పూర్తిగా పడకేసిన ప్రజారోగ్యం.. విష జ్వరాలతో జనం పరేషాన్ : కేటీఆర్
Rains | తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
KTR | పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయి : కేటీఆర్