Rains | హైదరాబాద్ : ఉత్తర పశ్చిమ బెంగాల్, ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీచేసింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా.. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎకువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని వివరించారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ఇప్పటికే అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల పట్ల కలెక్టర్లు దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో వర్షాబావ పరిస్థితులను బట్టి.. స్కూళ్లకు సెలవుల విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.