సిటీబ్యూరో : ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల ఆదివారం గాలి వాన బీభత్సం స్పష్టించింది. నలుగురి ప్రాణాలను తీసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, కీసర తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావానికి 30కి పైగా చెట్లు నేల కూలాయి. పలు చోట్ల హోర్డింగ్‌లు ఊడిపడ్డాయి. హయత్‌నగర్ పరిధిలో 30 విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిమ్మాయిపల్లిలో చెట్టు కూలి ఇద్దరు చనిపోయారు. మియాపూర్‌లో వేర్వేరు చోట్ల ఇటుకలు మీద పడి చిన్నారితో పాటు ఓ వ్యక్తి చనిపోయాడు. ఆదివారం రాత్రి 8గంటల వరకు వనస్థలిపురంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. మియాపూర్, బీహెచ్ఈఎల్లో 8.0మిల్లీ మీటర్లు, రామంతాపూర్, సరూర్‌నగర్, నాగోల్, ఉప్పల్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో 7.0మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కాగా, గ్రేటర్లో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆదివారం 14 చోట్ల ఫిర్యాదులను స్వీకరించగా, 13 ప్రాంతాల్లో సమస్యలకు పరిష్కారం చూపారు. ఎక్కువగా చెట్లు విరిగిపడటంపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. వర్షాలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా.. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నం. 21111111, 9000113667, 100, ట్రాఫిక్ సమస్యలపై పోలీసుల వాట్సాప్, హాక్ ఐ లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈదురు గాలులకు విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. 33కేవీ, 11కేవీ ఫీడర్లలోనూ అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల ఎల్ టీ లైన్లు బాగా దెబ్బతినడంతో సరఫరా పునరుద్ధరణ ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి చెందారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి(56), ధనుంజయ(46) ఆదివారం ద్విచక్ర వాహనంపై శామీర్‌పేటకు బయలుదేరారు. కీసర మండలం మీదుగా వస్తుండగా, తిమ్మాయిపల్లి వద్దకు రాగానే భారీ గాలి, వాన మొదలుకావడంతో వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు ద్విచక్ర వాహనాన్ని ఆపి, చెట్టు కిందకు వచ్చారు. విపరీతమైన గాలిరావడంతో వారు నిల్చున్న చెట్టు ఒక్కసారి కూలి వారి మీద పడింది. ఈ ఘటనలో నాగిరెడ్డి రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాగా, తీవ్రంగా గాయపడిన ధనుంజయ మార్గమధ్యలో చనిపోయాడు. ఇద్దరి మృతదేహాలను గాంధీకి తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట డివిజన్ సాయినగర్‌కు చెందిన చిన్నారి సమ్మద్(3)పై పక్కింటి ఐదో అంతస్తు పై నుంచి సిమెంట్ ఇటుకలు పడటంతో తీవ్ర గాయపడి చనిపోయాడు. ఇదే ప్రాంతంలో మహ్మద్ రషీద్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, షేక్ ఖుర్షీద్‌కు చెందిన ఇంటి ప్రహరీ సిమెంట్ ఇటుకలు తలపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా….చికిత్స పొందుతూ మృతి చెందాడు.