నగర ప్రజలకు రవాణా కష్టాలు తీర్చడమే ధ్యేయంగా, ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం… అనాలోచిత నిర్ణయాలు, అర్థం లేని రూట్ల మార్పుల వల్ల ఇప్పుడు మెట్రో విస్తరణను నిండా ముంచేశాయి. ఆ ఒక్క రూట్‌ను తెరమీదకు తీసుకు రావడమే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు శాపంగా మారింది. అసలు జన సంచారమే లేని, భవిష్యత్‌లో ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో తెలియని ఫ్యూచర్ సిటీకి వేల కోట్లు కుమ్మరించి మెట్రో వేస్తామనడంపై కేంద్ర ప్రభుత్వం గట్టిగానే కొర్రీలు పెడుతోంది. 10 లక్షల ప్రయాణికుల లక్ష్యానికి చేరకుండా, కొత్త రూట్ ప్రతిపాదనలు ఎందుకంటూ కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలతో ఇప్పుడు అసలు పంచాయితీ మొదలైంది.
సిటీబ్యూరో, జూన్ 28(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రారంభించిన సమయంలోనే అధికారికంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. మొదటి దశకు సంబంధించిన రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాలనేది మెట్రో రైలు సంస్థ ప్రాథమిక అంచనా వేసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉందని, ప్రస్తుతం కోర్ సిటీలో మెట్రో రైళ్లు నడుస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రయాణికుల రద్దీ పెరగడం లేదు.
ఇందుకు గల కారణాలను పరిశీలిస్తే… రెండున్నరేండ్లలో మెట్రో దిగిన తర్వాత ప్రయాణికులు, ఇండ్లు, ఆఫీసులకు చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. సామాన్యుడికి మెట్రో చార్జీలు భారంగా మారడంతోపాటు, స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలాలు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. మెట్రో రూట్లకు ఆర్టీసీ బస్సు సర్వీసులకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ లోపాలను సవరించి కోర్ సిటీలో ప్రయాణికుల సంఖ్యను 10 లక్షలకు ఎలా పెంచుతారో చెప్పాల్సింది పోయి.. అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రయాణికుల పెంపుపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు హెచ్ఎంఆర్ఎల్ నుంచి ఎలాంటి స్పష్టమైన వివరణ లేదని తెలిసింది.
జనమే లేని చోట వేల కోట్లతో మెట్రో..
ఇప్పటికే ఉన్న రూట్లలోనే ఆక్యుపెన్సీ రావడం లేదని నెత్తి నోరు కాంగ్రెస్ సర్కార్ టెండర్లు ఖరారై, పనులు చేపట్టాల్సిన రాయదుర్గం-శంషాబాద్ ప్రాజెక్టును రద్దు చేసింది. దీనికి బదులుగా నాగోల్ నుంచి ఎయిర్‌పోర్టును అనుసంధానం చేస్తామంటూ బీరాలు పోయింది. దీంతో ఐటీ కారిడార్ మినహా మిగతా రూట్లలో ఆశించిన రద్దీ లేకుండా పోయింది. ఇక జన సంచారమే లేని నిర్మానుష్య ప్రాంతాలకు మెట్రో ఎందుకని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్న రూట్లలోనే 10 లక్షల మార్కు దాటలేదని, కొత్తగా వేల కోట్లతో మెట్రో ఎందుకనే ప్రశ్నకు అటు హెచ్ఎంఆర్ఎల్, ఇటు ప్రభుత్వం వద్ద సమాధానమే లేకుండా పోయింది. భవిష్యత్‌లో అక్కడ పరిశ్రమలు, నివాసాల సంగతి పక్కనపెడితే.. అలాంటి రూట్లో వేల కోట్ల ప్రజాధనం కుమ్మరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నతో మొదలైన మెట్రో పంచాయితీ చివరకు ఎటూ తేల్చుకోలేని స్థితిలో నిలిచిపోయింది.
చిక్కుల్లో ఫేజ్-2
రద్దీ ఎక్కువగా ఉండే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు పాత రూట్‌ను రద్దు చేసి, ఫ్యూచర్ సిటీ వైపు తిప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటనేది ఇప్పటికీ కేంద్రానికి అంతు చిక్కని అంశంగా మారిందట. ఇక డీపీఆర్‌లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ కేంద్రం ఫైలును పక్కపెట్టడంతో మెట్రో రెండో దశ విస్తరణ భవితవ్యం ఇప్పుడు గందరగోళంలో పడింది. కోర్ సిటీలో రద్దీ పెంచే ప్రణాళికలు లేకుండా, కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఫ్యూచర్ సిటీ రూట్‌ను తెరపైకి తెచ్చారనే విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మెట్రో ఫేజ్-1 రుణ ప్రక్రియ పూర్తి అయితే గానీ, రెండో దశ ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సర్కారు చేసిన తొందరపాటు ప్రతిపాదనలు నగర మెట్రో భవిష్యత్‌ను తలకిందులు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.