సిటీ బ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రహణం వీడడం లేదు. కొంతకాలంగా ఈ ప్రా జెక్టుకు అన్ని అడ్డంకులే ఎదుర వుతున్నాయి. ఇటీవల ప్రభు త్వం ఓల్డ్ సిటీ మెట్రోను చాం ద్రాయణ గుట్ట వరకు విస్తరించేలా పనులు చేపట్టింది. కానీ ఈ మార్గంలో కోల్పోతున్న చారిత్రక కట్టడాలు మెట్రో నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ప్రాజెక్టును చేపట్టే క్రమంలో అధ్యయనం చేసిన హైదరాబాద్ మెట్రో సంస్థ వెయ్యికి పైగా చారిత్రక, ఆధ్యాత్మిక, మతపరమైన కట్టడాలను గుర్తించింది. ఈ క్ర మంలో వాటిని తొలగించి, ప్రాజెక్టు చేపట్టేలా నిర్వాహకులతో సంప్రదింపులు జరిపినా..ప్రాజెక్టు ముందుకు పోవడం లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ తలకు మించిన భారంగా మారుతున్నది. ప్రైవేట్ ఆస్తులను సేకరించే క్రమంలో ఎదురైన ఇబ్బందులను సంప్రదింపులతో తొలగిస్తున్నా… మతపరమైన, చారిత్రక కట్టడాల విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. చారిత్రక కట్టడాలను పరిరక్షించాలంటూ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు పలువురు వేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఈ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందని వాదిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా కోర్టులను ఆశయిస్తునారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులుగా చేర్చుతూ… పాతబస్తీలో మె ట్రో నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నది. చారిత్రక కట్టడాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారని పేర్కొంటూ.. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ వారసత్వ చట్టం 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను రక్షించాలని కోరుతున్నారు. పాతబస్తీ ప్రతిపాదిత మెట్రోమార్గం సమీపంలో చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురానా హవేలి, మొఘల్‌పురా సమాధులు వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నారు. మెట్రో రైలు నిర్మాణం కారణంగా ఈ స్మారక చిహ్నాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం పనులు చేపట్టే ముందు నిపుణుల బృందం పర్యవేక్షణలో జరగాలని కోరుతున్నారు. లేదంటే ప్రాజెక్టును నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణలో కీలకమైన భూసేకరణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల పొడవైన మెట్రోను ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఫేస్-2లో ఇదీ మొదటి కారిడార్ కానుండగా ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 800 ఆస్తులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను పలు దఫాలుగా జిల్లా రెవెన్యూ అధికారులు చేపట్టారు. మొదటి దశ ప్రైవేట్ ఆస్తులకు పరిహారాన్ని చెల్లించడం మొదలైంది. అదే సమయంలో కొన్నిచోట్ల కూల్చివేతలు ప్రారంభించారు. ప్రాజెక్టుకు భూములు స్వచ్ఛందంగా ఇచ్చే యజమానులతో సంప్రదింపులు చేస్తూనే, సమస్యాత్మక ఆస్తుల సేకరణపై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.