సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో యాజమాన్యం విఫలమవుతూనే ఉంది. ప్రయాణికుల సంఖ్య 4.6లక్షలకు చేరినా మెట్రో రైళ్లకు అదనంగా రావాల్సిన కొత్త బోగీలను ఏర్పాటు చేయలేకపోయింది. తాజాగా 60 కొత్త బోగీలను సమకూర్చాలని సరార్ నిర్ణయించినప్పటికీ, ఇందుకు కావాల్సిన భారీ నిధులను ఎకడి నుంచి తెస్తారనే దానిపై స్పష్టత కరువైంది. 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో తొలిదశ (69.2 కిలోమీటర్లు) మూడు కారిడార్లలో ప్రస్తుతం రోజుకు సగటున 4.6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 57 రైళ్లు మూడేసి బోగీలతో 1,200 ట్రిప్పులు తిరుగుతున్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్ర రద్దీతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే… తొలుత కొత్త బోగీల రాగాన్ని అందుకున్నది. ఈ హామీ ఇచ్చిన రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఇటీవల నగరవాసుల నుంచి వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో ప్రతి రైలుకు మరో బోగీని జత చేసి, 4 బోగీల రైళ్లుగా మార్చాలని భావిస్తోంది. ఈ 60 బోగీలకు రూ.1,200 కోట్లు అవసరం కానున్నాయి. అయితే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కింద ఈ బోగీలను కొనుగోలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటికి అయ్యే నిధులను ఎలా సర్దుబాటు చేయాలి?, రూ.1,200 కోట్ల ఆర్థిక భారాన్ని ఎవరు మోస్తారు? అన్నది ప్రధాన చికుముడిగా మారింది.
ప్రభుత్వానికి, ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్య నిధుల వ్యయంపై సయోధ్య కుదరడం లేదు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని చెబుతున్న ఎల్ అండ్ టీ అదనపు పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేస్తున్నది. నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతోంది. ప్రత్యేక నిధులు సమకూరుస్తామని అధికారులు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయా లేక ఆచరణలోకి వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా అదనపు బోగీలంటూ చేస్తున్న హడావుడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయా? లేక నోటి మాటలకే పరిమితం చేసి ప్రతిపాదనలను కాగితాలకే పరిమితమవుతాయా? అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఏళ్ల తరబడి నెలకొన్న నిర్వహణ లోపాలు, ఆదాయ మార్గాల కొరత ఇప్పటికే మెట్రో భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టాయి. ఒకవైపు అదనపు బోగీల కొనుగోలుకు రూ.1,200 కోట్ల నిధుల సమీకరణ ప్రశ్నార్థకంగా మార్చింది. మరోవైపు టికెట్ ధరలను మరోసారి సవరించి కొత్త బోగీలను ఏర్పాటు చేసుకోవాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలో మెట్రో స్వాధీనం ప్రక్రియను భుజనా వేసుకున్న సర్కార్..ప్రైవేటు సంస్థ ప్రయోజనాలకు మెట్రో ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడంలో విఫలం అవుతుంది. చివరకు నిత్యం ఎక్కడో చోట నిలిచిపోయే మెట్రో ప్రయాణానికి కూడా పరిష్కారం చూపించలేని స్థాయికి మెట్రో నిర్వహణ చేరిందనే విమర్శలు వస్తున్నాయి.