మేడ్చల్, జూన్15(నమస్తే తెలంగాణ): చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండరీలను ఏర్పాటు చేసి పిల్లర్లు కట్టి పెయింటింగ్ వేయనున్నారు. దీంతో వర్షాలు పడిన ప్రమాదాలు జరగకపోవడంతో పాటు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 4 వందల పైచిలుకు ఉన్న చెరువుల్లో ఈ విధంగా ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్టీఎల్ బౌండరీల ఏర్పాటుకు సంబంధించి నిధులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
వర్షాకాలంలో ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాన్ హోల్స్, నాలాల పూడికతీత పనులు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ బృందాలు గుర్తించి జిల్లాలోని మున్సిపాలిటీ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. డ్రైనేజీ మూతలు ఓపెన్ చేయకూడదని, ఎక్కడైనా మ్యాన్‌హోల్స్, నాలాలు ఓపెన్ చేసి ఉన్న చోట బ్యానర్లు తయారు చేసి డేంజర్ బోర్డుల సూచికలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ కమిషనర్లను ఆదేశించారు. ఎమర్జెన్సీ బృందాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివారణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.