ఆ పోస్టింగ్ భలే హాట్ గురూ.. అక్కడ పోస్టింగ్ కోసం ఎన్ని పైసలైనా పెట్టుకుంటాం.. మాకు మాదాపూర్ ఇచ్చినా సరే, ఇంకెక్కడైనా సరే.. సైబరాబాద్ కమిషనరేట్ అయితే చాలు.. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధం.. పోలీసు వర్గాల్లో కొందరు ఎస్సైల మధ్య జరిగిన చర్చ ఇది. ఇందుకోసం తమకు సన్నిహితంగా ఉండి పైరవీలు చేస్తున్న ఓ ఎస్సైని, ఆయన ద్వారా ఓ ఇన్స్పెక్టర్ను సంప్రదించారు. అంతకుముందే తమకు వచ్చిన ఫోన్ ఆధారంగా తాము సైబరాబాద్ వెళ్లడానికి సిద్ధమంటూ విల్లింగ్ ఇవ్వడంతో అసలు కథ మొదలైంది. పోస్టింగులు ఎక్కడ అనేది కూడా వారే డిసైడ్ చేశారట.
ఇంతకూ హైదరాబాద్ టు సైబరాబాద్ హాట్ అలాట్మెంట్లపై పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు ఇన్స్పెక్టర్ల బదిలీలు, సరెండర్లకు సంబంధించి లక్షల రూపాయల వ్యవహారం కొనసాగిందని గుసగుసలు వినిపిస్తుంటే తాజాగా ఎస్సైల కేటాయింపుల్లో సైబరాబాద్ పోస్టింగ్ కోసం డబ్బుల దందా జరిగిందని చర్చ జరుగుతోంది. శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 32 మంది ఎస్ఐలను వారి పేరెంట్ యూనిట్ అయిన జోన్ 6 చార్మినార్‌కు సరెండర్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో తమ కమిషనరేట్‌కు హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న 32 మంది ఎస్సైలు కావాలని కోరుతూ.. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో మాట్లాడినట్లు ఈ నేపథ్యంలో వారిని సైబరాబాద్‌కు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రెండు ఉత్తర్వులు ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వర్గాల్లో సంచలనంగా మారాయి.
– సిటీబ్యూరో
గప్‌చుప్‌గా కేటాయింపులు!
హైదరాబాద్‌లో పోలీసుల బదిలీలకు సంబంధించి ముందుగా ప్రాధాన్యమిచ్చేది సైబరాబాద్ కాగా ఆ తర్వాత ఫ్యూచర్‌సిటీ, మల్కాజిగిరి కమిషనరేట్ల తర్వాత జిల్లాలలో పోస్టింగులకు ప్రాధాన్యమిస్తుండగా చివరగా హైదరాబాద్‌లో పోస్టింగ్ కోరుకుంటారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సుమారు వంద నుంచి రెండు వందల మంది ఎస్సైలు తమకు అవకాశమిస్తే సైబరాబాద్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉండగా వారికి సమాచారమే లేకుండా గప్‌చుప్‌గా 32 మందిని సైబరాబాద్‌కు పంపించారు.
బ్యాచ్‌ల పరంగా కూడా చాలా వరకు విమర్శలు వెల్లువెత్తుతుండగా తమకేమీ తెలియకుండా లోపలలోపల ఈ వ్యవహారం చేశారంటూ సబ్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విల్లింగ్ కోరుకునే సందర్భంలో పలు కారణాలు చూపుతూ తాము సైబరాబాద్‌కు వెళ్లడానికి దరఖాస్తు చేసుకుంటే వాటిపై విచారణ జరిపి చివరగా ఖాళీల ప్రకారం జాబితాను విడుదల చేయాల్సి ఉండగా ఈ దఫా అలా కాకుండా సైబరాబాద్‌కు సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ల మధ్యవర్తిత్వంతో ఒక్కో పోస్టు రూ.3 నుంచి రూ.5లక్షల వరకు మాట్లాడుకుని వ్యవహారం ముగించినట్లు రెండు కమిషనరేట్లలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇందులో కొన్ని ముఖ్యమైన ఫోకల్ పోస్టింగులకు ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా వసూలు చేశారని మరో చర్చ జరుగుతోంది. మొదట ఈ విషయంలో ఆ ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు తమకు దగ్గరివారికి చాలామందికి ఫోన్ చేసి ఒక్కో పోస్టింగ్‌కు డబ్బులు ఖర్చవుతాయని చెప్పడంతో కొందరు ఎస్సైలు ఆలస్యంగా స్పందించారని తెలిసింది. ఆ తర్వాత తమకు పోస్టింగ్ కావాలని అడిగితే ఇప్పటికి కావలసినవి పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో మరికొన్ని పోస్టులు వస్తాయని, అప్పుడు మళ్లీ మీ పేర్లు పెట్టిస్తామని చెప్పినట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున లక్షల రూపాయల్లో పోస్టింగ్ దందా నడిచిన నేపథ్యంలో ఇదంతా ఉన్నతాధికారికి తెలియకుండానే జరిగిందా అనే చర్చ జరుగుతోంది. ఒకవైపు ఇన్స్పెక్టర్ల బదిలీల విషయంలోనే రచ్చ జరుగుతుండగా ఎస్సైల బదిలీల వ్యవహారం సైబరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసింది.
తెలియకుండానే జరిగింది..!
ఇదిలా ఉంటే సైబరాబాద్ నుంచి హైదరాబాద్ కమిషనరేట్‌లోని చార్మినార్ జోన్‌కు పంపించిన సబ్ ఇన్స్పెక్టర్ల ఆవేదన మరోతీరుగా ఉంది. తమకు తెలియకుండానే సరెండర్ చేశారని, సైబరాబాద్‌లో పనిచేస్తున్న తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే నేరుగా ఉత్తర్వులు ఇవ్వడంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 32మందిని హైదరాబాద్‌కు సరెండర్ చేసే క్రమంలో వారి విల్లింగ్ తీసుకుని వారు వెళ్తామంటే పంపించడం కరెక్టని, కానీ వారికి సంబంధం లేకుండానే ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా, కనీసం తమకు సమాచారం లేకుండా పెద్ద ఎత్తు సరెండర్ చేయడంపై ఆ ఎస్సైలు ఆందోళన చెందుతున్నారు.
ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని, తమ స్థానాలు ఖాళీ చేయించి అందులో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన వారిని నింపడానికే ఇలా చేస్తున్నారంటూ వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సైబరాబాద్‌లో ఎస్సైల కొరత తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్నవారికి అదనంగా ఇతర కమిషనరేట్ల నుంచి తీసుకురావలసింది పోయి సైబరాబాద్ నుంచి హైదరాబాద్‌కు పంపడం సరైన నిర్ణయం కాదని ఎస్సైలు అంటున్నారు. తమను రిలీవ్ కావాలంటూ పైనుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారని, హైదరాబాద్ నుంచి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి తమను పంపిస్తున్నారంటూ వారు చెప్పుకుంటున్నారు.
ఈ ఉత్తర్వుల్లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లకు సంబంధించిన డీసీపీలు ఎస్సైలను రిలీవ్ చేయాలని, వారు వెంటనే చార్మినార్ జోన్ డీఐజీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ నుంచి సైబరాబాద్‌కు ఎస్సైలను కేటాయించడానికి సంబంధించి కానీ అటు సైబరాబాద్‌లో పనిచేస్తున్న వారిని హైదరాబాద్‌కు సరెండర్ చేయడంపై డీజీకి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ఇన్స్పెక్టర్ల బదిలీలలో అవకతవకలు జరిగాయని, అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు చర్చ జరుగుతుండడంతో అసలు ఏం జరిగిందనే విషయంపై డీజీపీ ఆనంద్ ఆరా తీసినట్లు సమాచారం.
ఇదే సమయంలో ఎస్సైల వ్యవహారం కూడా బయటపడింది. ఇద్దరు కమిషనర్లు మాట్లాడుకున్నప్పటికీ సైబరాబాద్ ఎస్సైలనుంచి ఎలాంటి విల్లింగ్ లేకుండానే వారిని సరెండర్ చేయడంతో పాటు హైదరాబాద్ నుంచి సైబరాబాద్‌కు కేటాయింపుల వెనక ఏదో జరిగిందంటూ డీజీపీకి సమాచారం అందడంతో ఈ కేటాయింపులపై ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. ఇప్పటికీ ఇంకా రెండు కమిషనరేట్లలో ఎస్సైలు రిలీవ్ అయ్యారా లేదా అనేది తెలుసుకుని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పోస్టింగుల కేటాయింపులు, సరెండర్లపై విచారణ జరిపించాలంటూ సైబరాబాద్ టు హైదరాబాద్‌కు సరెండర్ చేసిన ఎస్సైలు డిమాండ్ చేస్తున్నారు.
సైబరాబాద్ పైనే ఎందుకు ఆసక్తి ..!
సైబరాబాద్ పోస్టింగ్ అనగానే పోలీసుల్లో చాలా ఆసక్తి కనిపిస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యమున్న పోస్టింగుల్లో సైబరాబాద్ ఒకటిగా పోలీసు వర్గాల్లో చెప్పుకుంటారు. ఇంతకూ సైబరాబాద్ పోలీసులకు ఎందుకు హాట్‌కేక్‌గా మారిందంటే అక్కడ అంత పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన లావాదేవీ జరుగుతాయంటూ వారు మాట్లాడుకుంటున్నారు. జీవితంలో ఒక్కసారైనా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పోస్టింగ్ తెచ్చుకోవాలంటూ హైదరాబాద్‌తో పాటు జిల్లాలలో పనిచేస్తున్న పోలీసులు కోరుకుంటున్నారంటే సైబరాబాద్ ఎంత ప్రాధాన్యమైనదో అర్ధం చేసుకోవచ్చు.
సైబరాబాద్‌లో గతంలో పనిచేసిన ఉన్నతాధికారి చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించడంతో అప్పట్లో కొంచెం తటపటాయించిన పోలీసులు ప్రస్తుత ఉన్నతాధికారి అందరికీ అనుకూలంగా ఉండడంతో పోస్టింగ్‌ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. అందులో బిగ్‌బ్రదర్స్ పోస్టింగులు కూడా ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవితంలో కావలసినంత సంపాదించుకునేందుకు అనుకూలమైన ప్రాంతంగా సైబరాబాద్‌ను పోలీసులే చెప్పుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ దందాలు, ప్రముఖులకు సంబంధించి ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, ఇతర అన్ని రకాల వ్యాపకాలకు కేంద్రబిందువైన సైబరాబాద్‌లో ప్రతీరోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయని, ఇందులో పర్సంటేజిల చొప్పున తీసుకున్నా మంచి సంపాదన ఉంటుందనే చర్చ జరుగుతోంది.