సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తోటి బ్యాచ్ మిత్రులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 2009వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉండగా.. రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ బ్యాచ్‌మేట్ ఎస్ఐ ఎం.అశోక్‌కు ఘన నివాళులర్పించారు.
ఆదివారం అశోక్ కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.26లక్షల ఆర్థిక సాయం అందించినట్లు బ్యాచ్ సొసైటీ అడ్మిన్, బేగంపేట సీఐ జి.శ్రీనివాస్‌వర్మ తెలిపారు. అదే ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ కుటుంబానికి కూడా రూ.5లక్షల ఆర్థిక సాయం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2020లో స్థాపితమైన ఈ వెల్ఫేర్ సొసైటీలో 1,100 మంది సభ్యులు ఉన్నారని, ఇప్పటి వరకు సొసైటీ తరఫున తమ బ్యాచ్‌కు చెందిన పలు పోలీసు కుటుంబాలకు రూ.2కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు శ్రీనివాస్‌వర్మ తెలిపారు.