గోల్నాక, సెప్టెంబర్ 8: తన భార్యపై కన్నేశాడని స్నేహితుడి పై అనుమానం వచ్చి దారుణంగా హత్య చేసిన కేసును అంబర్ పేట పోలీసులు ఛేదించారు. సోమవారం ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్యతో కలసి వివరాలను వెల్లడించారు. బీహార్‌కు చెందిన మహ్మద్ జావీద్ ,మహ్మద్ అమీరుల్ హక్, షోయబ్(30) ముగ్గురు స్నేహితులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోడుప్పల్ ద్వారకా నగర్లో నివాసముంటూ ఫాల్ సీలింగ్ కార్మికులగా పనిచేస్తున్నారు.
కొంత కాలంగా జూవీద్ భార్యపై షోయబ్ కన్నేశాడనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. షోయబ్ ప్రవర్తనలో మార్పు రాకపోడంతో పథకం ప్రకారం తన మరో స్నేహితుడు అమీరుల్ హక్ తో కలసి షోయబ్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గత నెల 20న రాత్రి సమయంలో అంబర్ పేట మూసీ పరీవాహక ప్రాంతంలో షోయబ్ కు మద్యం తాగించారు. అనంతరం వైర్లు మెడకు చుట్టి దారుణంగా హత్య చేసి అనుమానం రాకుండా మూసీ పడేసి జావీద్, అమీరుల్హక్ అక్కడి నుంచి పరారయ్యారు.
గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం మూసీలో లభ్యం కావడంతో పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా షోయబ్ స్నేహితుడు ఇ చ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఇద్దరు నిందితులు మహ్మద్ జావీద్, మహ్మద్ అమీరుల్ హక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు అడిషనల్ డీసీపీ నర్సయ్య పర్యవేక్షణలో ఏసీపీ హరీశ్‌కుమార్, అంబర్‌పేట సీఐ కిరణ్ కుమార్, డీఐ మహ్మద్ హఫీజ్ ఉద్దీన్ బృందం ఛేదించగా డీసీపీ బాలస్వామి వారిని అభినందించారు