NIMS | సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలందించేందుకు యూకే వైద్య బృందం దవాఖానకు రానున్నదని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. యూకేలో స్థిరపడ్డ డాక్టర్ రమణ దన్నపనేని ఆధ్వర్యంలో ప్రతి ఏటా వారం రోజుల పాటు నిమ్స్ భాగస్వామ్యంతో గుండె సమస్యలున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారన్నారు.
ఈ నెల 22 నుంచి 28 తేదీల్లో యూకే నుంచి డాక్టర్ రమణ నేతృత్వంలో ఫిల్ ఆర్నాల్డ్, గీతా, ఆనంద్ వాఘ్, నాగకిశోర్, బ్రాస్ అటాండి, నిమ్స్ దవాఖాన కార్డియోథోరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ అమరేశ్వరరావు, సీనియర్ వైద్యులు గోపాల్, వైద్య సిబ్బందితో కలిసి ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారన్నారు. గుండె సమస్యలున్న పిల్లలు నిమ్స్ కార్డియోథోరాసిక్ విభాగం వైద్యులను సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.