ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి భోజనం
నిత్యం 18,600 మందికి లబ్ధి
సర్కారుపై నెలకు రూ.3.22 కోట్ల భారం
వారం రోజుల్లో భోజనాలు ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహాయంగా వచ్చేవారు సరైన తిండి దొరకక అవస్థలు పడుతుండడంతో వైద్యఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగి సహాయకులకు రూ.5కే ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలని నిర్ణయించింది.
తొలుత జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఒక్కొక్కరికి మూడు పూటలా.. ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజి టబుల్ పలావ్, సాంబర్ రైస్ అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం, పప్పు లేదా సాంబార్, ఒక కూర, పచ్చడి వడ్డిస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.3.22 కోట్ల భారం పడనుంది.