సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత తాగునీటి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఆచరణలో పెట్టి చూపించింది.
ఈ క్రమంలో బుధవారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్న, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో పాటు వాటర్ వర్క్స్ అధికారులు, బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉచిత తాగునీటి అమలుపై విధి విధానాలు ఖరారు చేశారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా అమలులోకి వచ్చిందని తెలిపారు.
దీని వల్ల ఏడాదికి సర్కారుపై రూ.18కోట్ల మేర ఆర్ధిక భారం పడుతుందని చెప్పారు. దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉండగా ఒక్క తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఉచిత నీటి సరఫరా అమలు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. కంటోన్మెంట్ ప్రజలు కూడా మా బిడ్డలే, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో సుమారు 4 లక్షల మంది జనాభా ఉందని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వాటర్ వర్స్క్ ఈడీ సత్యనారాయణ, ఈఎన్సీ కృష్ణ, బోర్డు మాజీ సభ్యులు లోకనాధం, పాండు యాదవ్, నళినీ కిరణ్, అనిత ప్రభాకర్, భాగ్యశ్రీ శ్యామ్‌కుమార్‌తో పాటు బోర్డు అధికారులు దేవేందర్, రాజ్‌కుమార్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.