బంజారాహిల్స్, డిసెంబర్ 20: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు లు వసూలు చేసి మోసం చేసిన ఓ మహిళపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్‌లో నివాసం ఉంటున్న పి.సుజాత యాదవ్ అనే మహిళ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తుంటారు. ఆమెకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా బంజారాహిల్స్ రోడ్ నం.2లోని సాగర్ సొసైటీలోని ‘వీ-5 చానెల్’లో జర్నలిస్టుగా పనిచేసే డీఎస్.కవిత అనే మహిళ పరిచయమైంది.
తనకున్న పరిచయాలను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. సుజాత యాదవ్‌తో పాటు మరికొంత మంది వద్ద నుంచి సుమారు రూ.28లక్షల వరకు వసూలు చేసిన కవిత ముఖం చాటేసింది. తమ ఫోన్లు ఎత్తడంలేదని, డబ్బులు ఇవ్వడంలేదని బాధితురాలు సుజాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ):కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ ప్రకటనకు స్పందించిన ఓ ప్రైవేట్ ఉద్యోగి రూ.24.5లక్షలు పోగొట్టుకున్నాడు. శాలిబండకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఆర్సీఎస్ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటన కన్పించింది. వెంటనే దానిని క్లిక్ చేయగా.. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఓ మెసేజ్ వచ్చింది.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత అవతలి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు ఉద్యోగానికి అర్హత సాధించారు. అయితే ఫలాన ఫీజు, ట్యాక్స్‌లు చెల్లించండంటూ దఫదఫాలుగా ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ రూ.24.5లక్షలు కాజేశారు. ఈ మేరకు ఓ ఆఫర్ లెటర్‌ను సైతం పంపించారు. దానిని పరిశీలించగా.. అది ఫేక్ అని తేలింది. దీంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.