Crime News | సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): నకిలీ డాక్యుమెంట్లతో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్వేత కథనం ప్రకారం.. వీబీజె క్యాప్‌స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులైన కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య కందుల అనురాధ గుప్తా కలిసి కాప్రా పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీలో తమ ప్లాట్లు ఉన్నాయని, వాటిని మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నమ్మించి, నకిలీ పత్రాలతో అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసి పలువురి నుంచి రూ. 12.35 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారు.
వెంకటప్రసాద్‌పై గతంలో సీసీఎస్, ఫిలింనగర్, సరూర్‌నగర్, ఏపీ సీఐడీ, రాజమహేంద్రవరం ఠాణాల్లో కేసులు ఉన్నాయి. కాగా, మార్చి నెలలో సైనిక్‌పురికి చెందిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నిందితులైన ప్రసాద్ దంపతులను అరెస్టు చేశారు.