మల్కాజిగిరి, మే 27: కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఓ కన్సల్టెన్సీ.. విద్యార్థుల నుంచి రూ.45లక్షలు వసూ లు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద తమ నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్ లయోలా కాలేజికి చెందిన విద్యార్థులకు కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని కాప్రా ఏఎస్ రావు నగర్లోని కన్సల్టెన్సీ హామీ ఇచ్చింది. దీనికి కాలేజీ ప్లేస్మెంట్ అధికారి భరోసా కూడా ఇచ్చారు. దీంతో విద్యార్థులు విజయ్, మహమ్మద్ హుజాఫ్, అంకిత్, రోణియలు రూ. 10 లక్షల చొప్పున రూ. 40 లక్షలు, మరో విద్యార్థి రూ. 5 లక్షలు.. మొత్తం రూ. 45 లక్షలు కన్సల్టెన్సీకి చెల్లించారు. జాబ్ వీసాతో పాటు ఆఫర్ లెటర్ రావడానికి దాదాపు10 నెలలు పడుతుందని నమ్మించారు.
విద్యార్థులకు నమ్మకం కలగడానికి నకిలీ పత్రాలను చూపించారు. ఏడాది గడిచినా ఉద్యోగాలు ఇప్పించడంలేదు. కన్సల్టెన్సీ చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదు… అలాగే.. లయోలా కాలేజ్ ప్లేస్మెంట్ అధికారితో పాటు ప్రిన్సిపాల్ ను అభ్యర్థించినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోయారు.
చివరికి అల్వాల్ పోలీసులను ఆశ్రయించినా..వారినుంచి సరియైన సమాధానం ఇవ్వడంలేదని అన్నారు. తమకు డబ్బు చెల్లించే విధంగా లయోలా కాలేజ్ యా జమాన్యం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపట్టా రు. దీంతో కన్సల్టెన్సీ నుంచి జూన్ చివరి వారంలోగా డబ్బును తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని లయోలా ప్లేస్మెంట్ అధికారి హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు.