సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో అక్వాగార్డ్ వాటర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్ కావాలని నమ్మించి ఒక కంపెనీ సేల్స్ మేనేజర్‌కు సైబర్‌నేరగాళ్లు రూ.4 లక్షలు బురిడీ కొట్టించారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన బాధితుడు ఒక కంపెనీ వాటర్ ఫ్యూరిఫికేషన్కు గత నెలలో ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తన పేరు కుల్దీప్ సింగ్ అని, దుండిగల్ ఎయిర్ ఫోర్స్‌లో వాటర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, ఆ కాంట్రాక్టు మీకు అప్పగిస్తానని నమ్మించాడు.
డబ్బు లావాదేవీల కోసం మా బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను మీరు యాడ్ చేసుకోవాలని సూచన చేశాడు. వెరిఫికేషన్ కోసం రూ.10 బాధితుడు బదిలీ చేయగానే, అవతలి నుంచి తిరిగి రూ.20 బాధితుడి ఖాతాకు బదిలీ చేశారు. ఆ తరువాత బాదితుడికి ఫోన్ చేసి మీరు 1,99,995 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని, పెద్ద అర్డర్ కావడంతోపాటు డిఫెన్స్ విభాగానికి మీరు సరఫరా చేస్తున్నారు, అందుకు డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఆ మాటలు నమ్మి ఆ మొత్తాన్ని సైబర్‌నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ చేశాడు.
ఆ తరువాత వాటర్ ఫ్యూరిఫయర్స్ విషయాన్ని పక్కన పెట్టి, మీకు డబ్బులు రిఫండ్ వస్తాయి, మీ ఖాతాలోకి డబ్బులు పంపిస్తాం అంటూ మాట కలిపిన సైబర్‌నేరగాళ్లు మరో రూ.1,99,995 ఖాతాలో నుంచి కాజేశారు. ఇలా ఖాతాలో నుంచి రూ.4 లక్షలు సైబర్‌నేరగాళ్లు స్వాహా చేయడంతో మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.