సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడిన ఘరాన ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తిరుమలగిరికి చెందిన తిమ్మరి పుష్పలత జీహెచ్ఎంసీలో తాను ఉద్యోగం చేస్తున్నాని, ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నానని, ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించింది. ప్రాసెసింగ్ కోసం కొంత ఖర్చవుతుందని బాధితుల నుంచి ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసింది.
బాధితులు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎంతవరకు వచ్చాయంటూ అడగడం ప్రారంభించడంతో తన కొడుకు తిమ్మరి గోపీనాథ్ విశాల్మరికొందరితో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం కేటాయించినట్లు నకిలీ పత్రాలు తయారు చేసి ఇచ్చారు. తమకు నిజంగానే ఇండ్లు మంజూరయ్యాయని నమ్మిన బాధితులు త్వరలో తమచేతికి ఇండ్లకు సంబంధించిన తాళాలు వస్తాయంటూ ఆశతో ఉన్నారు. ఇలా మూడేండ్ల పాటు ఎదరుచూసిన బాధితులు చివరకు తాము మోసపోయామని గ్రహించారు. బాధితుల్లో ఒకరైన గోగికార్ ప్రసాద్.. మే 20వ తేదీన జరిగిన విషయమై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు జయరాజ్ గంగాధరన్ అని తేలింది. అతడు బాధితులను పుష్పలత వద్దకు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అయితే అతడు మృతి చెందినట్లు తెలిసిందని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు మిగతా IIవ పేజీలో
చేపట్టాలని డీసీపీ ఆదేశించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన తల్లీకొడుకులు పుష్పలత, విశాల్‌తో పాటు రాధస్వామి జిరాక్స్ సెంటర్ యజమాని మహేందర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన నిషారాజ్, చింటు రాజ్, రాజ్ అండ్ కో రబ్బర్ స్టాంప్ యజమాని పరారీలో ఉన్నట్లు, కోటి రూపాయల వరకు మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 79 నకిలీ పట్టాల సర్టిఫికెట్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును అల్వాల్ ఇన్స్పెక్టర్ వీరబాబు, డీఐ చంద్రశేఖర్ బృందం దర్యాప్తు చేస్తున్నారు.