సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మొన్నటికి మొన్న.. గత నెల రెండో వారంలో హఫీజ్‌పేట డివిజన్ సాయినగర్ యూత్ కాలనీలో బాల్కని గోడ కూలి మూడేళ్ల బాలుడు సమద్‌తో పాటు రషీద్(51) చనిపోయారు. గత సోమవారం మైలార్దేవపల్లి బాబుల్‌రెడ్డి నగర్లో గోడ కూలి నూర్జహాన్ కటూన్(10), ఆఫ్రియా పర్వీన్(5)లు మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో భారీ వర్షానికి గోడలు తడిసి ముద్దయి కూలిపోయాయి.
వాస్తవంగా పురాతన గోడలు, శిథిల భవనాల పట్ల జీహెచ్ఎంసీ ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మాన్సూన్కు ముందుగానే జోన్ల వారీగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై టౌన్‌ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.
శిథిల, ప్రమాదకరమైన భవనాలలో ఉన్న నివాసితులను గుర్తించి, వారిని అక్కడిని నుంచి ఖాళీ చేయడానికి గాను వారికి ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు ఆయా భవనాల చుట్టూ బారికేడ్లను అమర్చాల్సి ఉంటుంది.
వీటి పరిసర ప్రాంతాల్లోని నివాసితులు తగు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. కాని, ఈ ఏడాది శిథిల, పురాతన భవనాలపై టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ ఆలస్యంగా ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 498 శిథిల, పురాతన భవనాలను గుర్తించి అధికారులు గడిచిన 15 రోజులుగా 132 చోట్ల చర్యలు చేపట్టగా, పెండింగ్‌లో 366 ప్రాంతాలున్నాయి. ఒక్క చార్మినార్ జోన్లోనే 105, సికింద్రాబాద్‌లో 98, ఖైరతాబాద్‌లో 90 వరకు ఉండటం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. వచ్చే వారంలో వర్షాకాలం ప్రారంభం కానుండటం, పెండింగ్‌లో భారీగా పురాతన భవనాలు ఉండటంతో ప్రమాదకర భవనాల పట్ల స్థానికులు, నివాసితుల ప్రాణాల భద్రత గాలిలో దీపంలా మారింది. ఏదైనా ఘటన జరగక ముందే అధికారులు అప్రమత్తమై శిథిల భవనాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.