బంజారాహిల్స్,జనవరి 3: తమ ఇంటిముందు వాహనాలు ఎందుకు పార్క్(Parking dispute) చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన దశరథ్ దాస్ మోంగురే (41), దుర్గేష్ దృవే(21), శివప్రసాద్ శర్మ(24)తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ పటేల్ (27) బంజారాహిల్స్‌లోని ఎన్బీటీనగర్లో శ్రీశైలం అనే సివిల్ కాంట్రాక్టర్ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే తమ సైట్‌కు చెందిన వాహనాలు అప్పుడప్పుడు తీసుకువచ్చి ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తుంటారు.
ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉంటున్న పొలుకొండ రాజు(45) అనే వ్యక్తికి చెందిన ఇంటిముందు ఈనెల 1న సాయంత్రం తమ వాహనాలను పార్క్ చేశారు. దీంతో బయటి నుంచి వాహనాలు తెచ్చి తమ ఇండ్ల ముందు పార్క్ చేస్తే ఎలా అంటూ రాజు వారిని ప్రశ్నించారు. దీంతో అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న దుర్గేష్ దృవే, దశరథ్ తదితరులు రాజు మీద విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
చేతి కడెంతో తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాజు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు అతడిని హాస్పిటల్లో చేర్చారు. అతడి బైక్‌ను కూడా ధ్వంసం చేశారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ 118(1), 324(4), 351(2) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.