నగరం, శివారు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. దాదాపు 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారంతా వేర్వేరు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలిలా ఉన్నాయి.
శామీర్‌పేట: కారు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా బొమ్మాపూర్ గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డి, తల్లి పుష్పలత (48), అక్క రష్మిత, కోడలు రయన్షితో కలిసి భూపలపల్లి నుంచి నిజాంపేటకు కారులో ప్రయాణం చేస్తున్నారు. శామీర్‌పేట ఓఆర్ఆర్పై వర్షం కారణంగా ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పుష్పలత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. కారు నడుపుతున్న మనోహర్‌రెడ్డి, రష్మిత, రియన్షిలకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. శేరిలింగంపల్లి నివాసి కొంపల్లి వెంకట్‌రెడ్డి(55) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తన బంధువులు ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై మేడ్చల్ వైపు వస్తున్నాడు. మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో ఆగి ఉన్న కారు డోర్‌ను తీయడంతో ద్విచక్ర వాహనానికి తగిలి కింద పడిపోయారు. అదే సమయంలో వీరి వెనుక నుంచి వచ్చిన డీసీఎం చక్రాలు వెంకట్‌రెడ్డి తలపై నుంచి వెళ్లాయి. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మేడ్చల్, సెప్టెంబర్ 30: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన మజ్జి శ్రీకాంత్, మున్నూరు నరేశ్ ద్విచక్ర వాహనంపై సోమవారం తెల్లవారుజామున కామారెడ్డి వైపు నుంచి వస్తుండగా.. మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లికి సమీపంలోకి రాగానే మజీద్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. నరేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయాల పాలైన నరేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మైలార్‌దేవ్‌పల్లి: అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా మెహిదీపట్నం వైపు ఓ కారు వెళ్తోంది. అతివేగంగా వెళ్తున్న ఆ కారు పిల్లర్ నంబర్ 285 వద్దకు రాగానే ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని.. పక్క రోడ్డులోకి వెళ్లి బీభత్సం సృష్టించింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును పక్కకు తీసి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 30: అతివేగం ఒక యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు కథనం ప్రకారం.. హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన సాయితేజ (24)జెన్‌ప్యాక్ ఉద్యోగి. విధుల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున క్యాబ్‌లో తోటి ఉద్యోగులు సాయిసుధ, సాయికిషన్, మాధురి, సందీప్‌తో కలిసి గచ్చిబౌలికి బయలు దేరారు.
హయత్‌నగర్ నుంచి గచ్చిబౌలిలోని జెన్ప్యాక్కు బయలుదేరిన క్యాబ్.. తెల్లవారుజాము 5 గంటల సమయంలో మాసబ్‌ట్యాంక్‌లోని ఫ్లై ఓవర్ సమీపంలోకి రాగానే.. ఓ ద్విచక్రవాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి.. అదే వేగంతో క్యాబ్ డ్రైవర్ సాయివంశీ డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చున్న సాయితేజ (24)అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురు ఉద్యోగులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అత్తాపూర్‌లోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అందరూ చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, అనంతరం ఆ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.