మూసీ పరీవాహక బాధితుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తున్నది. ఉస్మాన్‌సాగర్ సమీపంలోని మంచిరేవుల నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నది. అభివృద్ధి పేరిట తమ ఇండ్లను కూల్చి, భూములు లాక్కోవద్దని మూసీ పరీవాహక ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం కనికరించడం లేదు. బాధితుల వేదనను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తనపని తాను చేసుకుంటూ పోతున్నది. పైసా పైసా పోగేసుకుని కట్టుకున్న ఇండ్లను కూల్చొద్దని వేడుకుంటున్నా వినకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నది. బాధిత ప్రజలు నెలల తరబడిగా ప్రభుత్వం తీరుపై నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరిట తమకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయొద్దని వేడుకున్నా కనికరం చూపడం లేదు.
– సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ); మూసీ పునరుజ్జీవంలో భాగంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ దాకా ఫేజ్-1లో చేపట్టిన మూసీ సరోవర్ ప్రాజెక్టు పనులను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ముందుగా ప్రాజెక్టులో భాగంగా గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ సమీపంలోని మంచిరేవుల వీరభద్రస్వామి గుడిలో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. బాధితులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మూసీ సుందరీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి అవేమీ పట్టించుకోకుండా పనులు ప్రారంభిస్తున్నారు. మరోవైపు అధికారులు మూసీ పరీవాహక ప్రజలు ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో గూడు చెదిరిపోతుందనే మనోవేదనతో బాధిత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
మూసీ పునరుజ్జీవంలో భాగంగా దేవుడి పేరుతో భూదోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నదని దేవుడు, గాంధీ పేరుతో మోసం చేస్తున్నది. మంచిరేవులలో దేవుడి పేరిట ఉన్న భూములను కొట్టేసేందుకు గుడి కడతామని చెప్తున్నారు. ఇప్పటికే కోకాపేటలోని శారదా పీఠాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నించి.. బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ప్రశ్నించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో మంచిరేవుల దేవుడి భూములపై కన్నేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములను కొల్లగొట్టే పనులు మానుకోకుంటే లగచర్ల, వెలుగుమట్ల, హెచ్‌సీయూ ఉద్యమాల తరహాలో పోరాడతాం. డీపీఆర్ వారం రోజుల్లో బయటపెడతామని చెప్పి 15 రోజులు దాటుతున్నా గోప్యంగా ఉంచుతున్నారు. అసలు ప్రాజెక్టులో ఏం ఉందో ప్రజలకు చెప్పకుండా రోజుకో రకంగా మాట్లాడుతూ.. మభ్యపెడుతున్నారు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రజలందరితో ప్రభుత్వంపై పోరాటాలు కొనసాగిస్తాం.
– గోసుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్
డీపీఆర్ లేకుండా సుందరీకరణ ఏ ప్రాతిపదికన చేస్తారు. అసలు ప్రాజెక్టు స్వరూపం ఏంది? దాని వల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకురుతుందో బయట పెట్టకుండా ఇష్టమొచ్చినట్లు రోజుకో విధానం బయటపెడుతున్నారు. మురుగును ఎలా శుద్ధి చేస్తారు? మూసీలో రసాయనాలు కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రజలతో చర్చించాలి. అంతేకానీ ప్రజలను, బాధితులను భాగస్వామ్యం చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు. నదిని కాపాడండి.. దాని పక్కన నివసిస్తున్న ప్రజలకు రక్షణ కల్పించండి. అభివృద్ధి చేయండి.. కానీ ఒకసారి గాంధీ విగ్రహం అని, ఇప్పుడు గుడిని నిర్మిస్తామని అంటున్నారు. అసలు మూసీ ప్రాజెక్టుతో ఏం చేయాలనుకుంటున్నారో అధికారికంగా ప్రజల ముందు ఉంచాలి. ప్రజలకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకుంటే ఐక్య పోరాటాలు చేస్తాం.
– వర్గీస్, మూసీ జనాందోళన్ ప్రతినిధి