హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ (Death Threat) కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారున్ని లక్ష్యంగా చేసుకుని లేఖ రాశారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రవీందర్ గౌడ్ కుమారుడు కూన రాఘవేందర్ గౌడ్‌ను చంపుతామని బెదిరించారు. మరుసటి రోజు వస్తామని, డబ్బు ఇవ్వకపోతే తనకున్న రెండు ఇండ్లను బాంబులతో పేల్చేస్తామని అందులో పేర్కొన్నారు.
ఇంటి ముందు వస్తువులను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. కారుపై ఎరుపు రంగు టవల్లో లేఖ పెట్టి వెళ్లిపోయారు. ఈ నెల 21న ఘటన జరిగినట్లు రాఘవేందర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి మాస్క్ ధరించి వచ్చినట్లుగా గుర్తించారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.